Share News

PM Kisan Delay: పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఇంకా రాలే.. ఆలస్యానికి కారణాలేంటి?

ABN , Publish Date - Jul 18 , 2025 | 08:32 PM

దేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కోట్లాది మంది రైతులకు నిరాశ కలిగింది. ఎందుకంటే జూలై 18న రైతుల బ్యాంకు ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన 20వ విడత డబ్బులు వస్తాయని ఆశించారు. కానీ అలా జరగలేదు. అయితే దీనికి గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

PM Kisan Delay: పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు ఇంకా రాలే.. ఆలస్యానికి కారణాలేంటి?
PM Kisan 20th installment delay

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) యోజన 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పథకం రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. జులై 18 నాటికి ఈ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అనేక మంది భావించారు. కానీ ఇంకా ఆ డబ్బు చేరలేదు(PM Kisan Delay Reason). దీంతో రైతుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ విడత డబ్బు ఎప్పుడు వస్తుంది? ఈ నెలలో వస్తుందా, లేదా? అని ఆలోచిస్తున్నారు. అయితే అసలు ఆలస్యానికి కారణాలు ఏంటనేది తెలుసుకుందాం.


20వ విడత ఎప్పుడు వస్తుంది

జులై 18, 2025న బిహార్‌లోని మోతిహారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కార్యక్రమంలో 20వ విడత నిధులు విడుదల చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. కానీ దీనిపై నేడు ఎటువంటి ప్రకటనా రాలేదు. డబ్బు కూడా జమ కాలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం లేనప్పటికీ, ఈ నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ విడత డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. రైతుల డేటాను జాగ్రత్తగా సరిచూసే ప్రక్రియ కారణంగా ఈ ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఎవరూ అర్హత కోల్పోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.


ఆలస్యానికి కారణాలు ఏమిటి?

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ లోపాలు: కొంతమంది రైతుల ఆధార్, బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులను పరిశీలించే ప్రక్రియలో ఆలస్యం కావచ్చు.

  • ఈ-కేవైసీ పూర్తి కాకపోవడం: కొన్ని రాష్ట్రాల్లో రైతులు ఈ-కేవైసీ ప్రక్రియను ఇంకా పూర్తి చేయలేదని తెలుస్తోంది.

  • ఆధార్-బ్యాంకు ఖాతా లింక్ సమస్యలు: ఆధార్‌తో బ్యాంకు ఖాతా సరిగా లింక్ కాకపోవడం వల్ల కూడా ఆలస్యం జరుగుతోంది.


రైతులు ఏం చేయాలి?

  • 20వ విడత డబ్బు సకాలంలో పొందడానికి రైతులు ఈ కింది దశలను పాటించాలి.

  • ఈ-కేవైసీ పూర్తి చేయండి: ఆధార్ నంబర్‌తో ఓటీపీ లేదా బయోమెట్రిక్ పద్ధతిలో ఈ-కేవైసీ చేయండి. దీన్ని పీఎం కిసాన్ పోర్టల్ (https://pmkisan.gov.in) లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా చేయవచ్చు.

  • భూలేఖ్ వెరిఫికేషన్: రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో భూమి వివరాలను సరిచూసుకోండి.

  • ఆధార్-బ్యాంకు లింక్: బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయి ఉండేలా చూసుకోండి.

  • వివరాల సరిపోలిక: ఆధార్, బ్యాంకు ఖాతా, రైతు రిజిస్ట్రేషన్‌లోని వివరాలు ఒకేలా ఉండాలి.


డబ్బు రాకపోతే ఏం చేయాలి?

  • బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేయండి: పీఎం కిసాన్ పోర్టల్‌లో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌ను ఉపయోగించి మీ స్టేటస్ తనిఖీ చేయండి. ఎఫ్‌టీఓ జనరేటెడ్ అని కనిపిస్తే, డబ్బు మీకు త్వరలో జమ అవుతుందని అర్థం.

  • లోపాలను సరిచేయండి: ఆధార్ లేదా బ్యాంకు ఖాతా వివరాల్లో లోపం ఉంటే, సీఎస్సీ సెంటర్ లేదా వ్యవసాయ శాఖను సంప్రదించండి

  • హెల్ప్‌లైన్ సంప్రదించండి: 155261 లేదా 1800115526 నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చు.


ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 10:02 PM