Dhankhar resignation reason: రాజీనామాకుకారణాలేమిటి
ABN , Publish Date - Jul 23 , 2025 | 03:14 AM
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర సీఎం మమతతో చీటికిమాటికి సహాయనిరాకరణకు దిగిన వ్యక్తిగా

ధన్‌ఖడ్ ఆకస్మిక నిర్ణయంపై భిన్న విశ్లేషణలు
నితీశ్‌ను ఉపరాష్ట్రపతి చేయటం కోసం.. బీజేపీ అమలుపరిచిన వ్యూహంలో భాగం?
జస్టిస్ వర్మ అభిశంసనపై ప్రభుత్వంతో పెరిగిన అంతరం!
విపక్ష ఎంపీల నోటీసును స్వీకరించటంపై కేంద్రం గుస్సా!
న్యాయవ్యవస్థపై ధన్‌ఖడ్ వ్యాఖ్యలతో కేంద్రంలో అసహనం!
ధన్‌ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ
అనేక పదవుల ద్వారా ధన్‌ఖడ్ ప్రజాసేవ చేశారు: ప్రధాని
ధన్‌ఖడ్ రాజీనామా వెనుక లోతైన కారణాలున్నాయి
రైతుబిడ్డకు మర్యాదపూర్వక వీడ్కోలు లభించలేదు: జైరాం
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆ రాష్ట్ర సీఎం మమతతో చీటికిమాటికి సహాయనిరాకరణకు దిగిన వ్యక్తిగా, ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత ఏకంగా న్యాయవ్యవస్థపైనే తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తిగా దేశప్రజలకు చిరపరిచితమైన జగదీప్ ధన్‌ఖడ్ (74).. ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిలో మరో రెండేళ్ల పదవీకాలం ఉండగానే.. ఆయన ఎందుకు రాజీనామా చేశారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ధన్‌ఖడ్ రాజీనామాకు గల కారణాలపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి.. వాటిలో ఒకటి.. బిహార్ ఎన్నికలకు సంబంధించినది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో బీజేపీ ఇప్పటి వరకూ సొంతంగా అధికారంలోకి రాలేదు. ప్రస్తుతం నితీశ్‌కుమార్ సారథ్యంలోని జేడీయూతో కలిసి కమలం పార్టీ కూటమి ప్రభుత్వం కొలువై ఉన్న విషయం తెలిసిందే. నితీశ్‌ను రాష్ట్ర రాజకీయాల్నించి తప్పించి, ఉపరాష్ట్రపతిని చేస్తే బిహార్‌లో బీజేపీ అవకాశాలు మరింత పెరుగుతాయని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తోందని, దాంట్లో భాగంగానే ధన్‌ఖడ్ రాజీనామా అని ఓ వాదన వినిపిస్తోంది. బిహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ దీనిపై స్పందిస్తూ.. నితీశ్ ఉపరాష్ట్రపతి అయితే రాష్ట్రానికి ఎంతో మంచిదని పేర్కొనటం విశేషం.
ప్రభుత్వంతో పెరిగిన అంతరం
కేంద్రప్రభుత్వానికి, ధన్‌ఖడ్‌కు మధ్య అంతరం పెరిగిందని, ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారన్నది మరో వాదన. దీని ప్రకారం.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ అభిశంసనపై ప్రతిపక్ష ఎంపీలు ఇచ్చిన నోటీసును ధన్‌ఖడ్ స్వీకరించటం ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఓవైపు ఇదే అంశంపై లోక్‌సభలో ప్రభుత్వం నోటీసు ఇచ్చే ప్రక్రియలో ఉంది. ఇంతలోనే రాజ్యసభలో ప్రతిపక్షాల నోటీసును ధన్‌ఖడ్ స్వీకరించటంతో.. జస్టిస్ వర్మ అభిశంసన అంశం తాలూకు క్రెడిట్ తమకు దక్కకుండా పోయిందని కేంద్రం భావించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే, పార్లమెంటు సమావేశాల తొలిరోజైన సోమవారం జరిగిన రాజ్యసభ ‘సభా వ్యవహారాల సంఘం’ భేటీకి ప్రభుత్వం తరఫున సభ నాయకుడు జేపీ నడ్డా, పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రెజిజూ హాజరు కాలేదని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత సభలో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఆపరేషన్ సిందూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతుండటంతో.. నడ్డా వారిని హెచ్చరిస్తూ మాట్లాడారు. ‘ఏదీ రికార్డుల్లోకి వెళ్లదు. నేను చెప్పినవి మాత్రమే రికార్డవుతాయి’ అన్నారు. సభలో పూర్తి అధికారం సభాపతి అయిన చైర్మన్‌దే అయినప్పటికీ, నడ్డా ఈ విధంగా మాట్లాడటం సభాపతిని అవమానించటమేనంటూ కాంగ్రెస్ విమర్శించింది. ఈ విధంగా ప్రభుత్వంతో పెరిగిన అంతరం నేపథ్యంలోనే ధన్‌ఖడ్ రాజీనామా చేశారన్నది ఒక వాదన.
న్యాయవ్యవస్థపై తీవ్రవ్యాఖ్యలు
2022లో ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత న్యాయవ్యవస్థపై తరచూ విమర్శలు చేయటం ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటుదే అత్యున్నత పాత్ర అని, న్యాయవ్యవస్థ అప్పుడప్పుడూ పరిధి దాటి ప్రవర్తిస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు. ‘జాతీయ న్యాయ నియామకాల కమిషన్’ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మరీ శృతిమించటం ప్రభుత్వ పెద్దలకు చికాకు కలిగించిందని, దీనివల్లే ఆయనను పక్కన పెట్టారని మరో వాదన. ఏదేమైనా, తాను తన పదవీ కాలం పూర్తి చేసుకొని 2027 ఆగస్టులో రిటైర్ అవుతానని ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఇటీవలే ప్రకటించిన ధన్‌ఖడ్..ఇంతలోనే మనసు మార్చుకోవటం విశేషం. - సెంట్రల్ డెస్క్
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి