Share News

Vande Bharat Occupancy: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంచి జనాదరణ.. ఆక్యుపెన్సీ రేషియో ఎంతంటే..

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:20 PM

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల్లో ఆక్యుపెన్సీ రేషియో 100కు పైగానే ఉందని కేంద్ర మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. ఈ ఏడాది జూన్ వరకూ ఆక్యుపెన్సీ రేషియో 105.03 శాతంగా ఉందని తెలిపారు.

Vande Bharat Occupancy: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంచి జనాదరణ.. ఆక్యుపెన్సీ రేషియో ఎంతంటే..
Vande Bharat occupancy

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు అత్యాధునిక, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందించేందుకు ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు మంచి జనాదరణ దక్కుతోంది. ప్రస్తుతం అన్ని రూట్‌లల్లో ఈ రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో 100 శాతానికి పైగానే ఉంటోంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో బుధవారం వెల్లడించారు. రైళ్లల్లో ఉన్న మొత్తం సీట్లకు గాను సగటున ఎందరు ప్రయాణికులు జర్నీ చేశారనే దాన్ని ఆక్యుపెన్సీ రేషియోగా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే.

కేంద్ర మంత్రి ప్రకటన ప్రకారం, 2024-25 సంవత్సరానికి గాను వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల్లో స్థూల ఆక్యుపెన్సీ రేషియో 102.01 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకూ ఆక్యుపెన్సీ రేషియో 105.03 శాతానికి చేరుకుంది.

సెమీ హైస్పీడ్ వేగంతో ప్రయాణించే వందే భారత్‌ రైళ్ల కోచ్‌లను ప్రస్తుతం చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 144 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వివిధ రూట్‌లల్లో నడుస్తున్నాయి. మహారాష్ట్రలో 22 రైళ్లు, మధ్యప్రదేశ్‌లో 8 వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి.


ప్రయాణికులకు భద్రమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం అందించేందుకు రైల్వే శాఖ ఈ రైళ్లల్లో పలు అధునాత ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది. రైలు ప్రమాదాలకు తావు లేకుండా కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. గంటకు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని డిజైన్ చేశారు. యూవీ-సీ డిస్‌ఇన్‌ఫెక్షన్ వ్యవస్థ, ఏసీ, కుదుపులు లేని ప్రయాణం కోసం సెమీ పర్మనెంట్ కప్లర్స్, సెంట్రల్లీ కంట్రోల్డ్ ఆటోమేటెడ్ డోర్స్ వంటివి ఫీచర్లు ఈ రైళ్లల్లో ఉన్నాయి. ఈ రైళ్లల్లోని కోచ్‌లల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ అలార్మ్ బటన్, టాక్ బ్యాక్ యూనిట్స్, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎయిరోసాల్ ఆధారిత ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టమ్, దివ్యాంగుల కోసం ప్రత్యేక లావెటరీల వంటివి కూడా ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం వందే భారత్ రైళ్లల్లో కోచ్‌ల సంఖ్య 8, 16, లేదా 20గా ఉంది. చైర్ కార్ కోచ్‌లో ఒక రకమైన సీటింగ్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో మరో వర్షన్ సీటింగ్‌ను ఏర్పాటు చేశారు. అయితే, కొన్ని రూట్‌లల్లో కోచ్‌ల సంఖ్యను పెంచాలని కూడా ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని మోదీ

మాజీ ఉపరాష్ట్రపతికి టైప్ 8 బంగళా కేటాయించిన కేంద్రం.. అసలు ఇదేంటంటే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2025 | 01:31 PM