US Visa: వచ్చే ఏడాది నుంచి అమెరికా వీసా చార్జీల పెంపు
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:07 AM
ఉద్యోగ (హెచ్-1బీ), విద్యార్థి (ఎఫ్/ఎం), పర్యాటక/వ్యాపార (బీ-1, బీ2), ఎక్స్చేంజ్ (జే) వీసాలపై అమెరికా వెళ్లేవారిపై వచ్చే ఏడాది నుంచి మరింత భారం పడనుంది..

విద్యార్థి, పర్యాటక, వ్యాపార, ఎక్స్చేంజ్ వీసాలపై..
ఇంటిగ్రిటీ రుసుము 250 డాలర్లు
ఐ-94 ఫీ-24; ఈఎ్‌సటీఏ-13; ఈవీయూఎస్-30 డాలర్లు!
న్యూఢిల్లీ, జూలై 9: ఉద్యోగ (హెచ్-1బీ), విద్యార్థి (ఎఫ్/ఎం), పర్యాటక/వ్యాపార (బీ-1, బీ2), ఎక్స్చేంజ్ (జే) వీసాలపై అమెరికా వెళ్లేవారిపై వచ్చే ఏడాది నుంచి మరింత భారం పడనుంది! ఈ వీసాలతో తమ గడ్డపై అడుగుపెట్టాలనుకునేవారి నుంచి ‘ఇంటెగ్రిటీ ఫీ’ కింద అదనంగా 250 డాలర్ల రుసుము (మన కరెన్సీలో దాదాపుగా రూ.21,500) వసూలు చేయాలని అమెరికా సర్కారు నిర్ణయించింది. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై అమెరికాకు వచ్చేవారు అక్రమంగా ఉండిపోకుండా, వీసా కాలానికి మించి ఉండకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఆమోదించిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్’ కింద.. ఈ పెంపు వచ్చే ఏడాది నుంచి అమలు కానుంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ రుసుములో మార్పుచేర్పులు ఉంటాయి. అంటే.. ద్రవ్యోల్బణం పెరిగితే ఎక్కువ రుసుము వసూలు చేస్తారు. ఈ వీసాలపై అమెరికాలో అడుగుపెట్టేవారు నిర్ణీత షరతులను పాటిస్తే ఇంటెగ్రిటీ ఫీ కింద వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు. దౌత్య (ఏ, జీ) వీసాలపై వచ్చేవారికి మాత్రం ఈ రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.
వీసా జారీ చేసేటప్పుడే అమెరికా ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ’ ఈ రుసుమును సర్‌చార్జ్ రూపంలో వసూలు చేస్తుంది. దీంతోపాటు.. ఐ-94 సర్‌చార్జ్ (24 డాలర్లు), ఎలకా్ట్రనిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈఎ్‌సటీఏ- 13 డాలర్లు)/ఎలకా్ట్రనిక్ వీసా అప్‌డేట్ సిస్టమ్ (ఈవీయూఎస్-30 డాలర్లు) కింద అదనపు రుసుములను ఈ బిల్లులో పొందుపరిచారు. అవి కూడా కలుపుకొంటే వీసా రుసుములు భారంగా మారనున్నాయి. ఉదాహరణకు.. ప్రస్తుతం అమెరికాకు పర్యాటక/వ్యాపార వీసాపై వెళ్లాలంటే అందుకు వీసా చార్జీల కింద 185 డాలర్లు వసూలు చేస్తున్నారు. అంటే దాదాపుగా రూ.15,855. బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్‌లో ప్రతిపాదించిన ఇతర చార్జీలను, ఇంటెగ్రిటీ రుసుమును కూడా కలుపుకొంటే అది ఏకంగా 472 డాలర్లకు (రూ.40,456) చేరుతుంది. ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కించి ‘వినియోదారుల ధరల సూచీ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ఆధారంగా భవిష్యత్తులో ‘ఇంటెగ్రిటీ ఫీ’ని పెంచితే.. చెల్లించాల్సిన మొత్తం ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది.
ఆ 250 డాలర్లు తిరిగి పొందాలంటే..
అమెరికా సర్కారు విధించిన కొన్ని షరతులను పాటిస్తే.. ఇంటెగ్రిటీ రుసుము కింద కట్టిన 250 డాలర్లను తిరిగిచ్చేస్తారు. అవేంటంటే..
వీసా గడువును పొడిగించాలనో లేక ఒక వీసాపై వచ్చి దాన్ని వేరే వీసాగా మార్చాలనో కోరకుండా.. వీసా గడువు ముగిసిన ఐదు రోజుల్లోపేఅమెరికా నుంచి తమ దేశానికి వెళ్లిపోయే వారికి ఇంటెగ్రిటీ రుసుమును తిరిగిచ్చేస్తారు.
ఐ-94 (అమెరికాలోకి మనం ప్రవేశించే, తిరిగి వెళ్లే తేదీలను నమోదు చేసే రికార్డు) గడువు ముగిసేలోపే విజయవంతంగా శాశ్వత నివాస హోదా పొందినవారికి ఆ సొమ్ము రీఫండ్ చేస్తారు.
..అయితే, రీఫండ్ ప్రక్రియ ఆటోమేటిగ్గా జరగదు. అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు పరిశీలించి సొమ్ము తిరిగిస్తారు. ఈ షరతులను పాటించనివారు కట్టిన రుసుము నేరుగా అమెరికా కోశాగారంలోని జనరల్ ఫండ్‌కు చేరుతుంది.
‘గోల్డెన్ వీసా’పై కథనాలను ఖండించిన యూఏఈ
న్యూఢిల్లీ, జూలై 9: కేవలం రూ.23 లక్షలు చెల్లిస్తే యూఏఈ గోల్డెన్ వీసాను పొందవచ్చన్న మీడియా కథనాలను ఆ దేశం ఖండించింది. గోల్డెన్ వీసాకు సంబంధించిన రూల్స్‌ను స్పష్టంగా నిర్వచించామని, ఆసక్తి ఉన్న వారు అథారిటీ వెబ్‌సైట్ లేదా స్మార్ట్ అప్లికేషన్‌ద్వారా అధికారిక సమాచారాన్ని పొందవచ్చని తెలిపింది. అన్ని గోల్డెన్ వీసా దరఖాస్తుల ప్రక్రియను యూఏఈలోని అధికారిక ప్రభుత్వ మార్గాల ద్వారా చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో ఏ కన్సల్టెన్సీ సంస్థను ఆథరైజ్డ్ పార్టీగా గుర్తించలేదని పేర్కొంది. యూఏఈలో నివసించాలనుకునే వ్యక్తుల నుంచి అక్రమంగా సొమ్ములు వసూలు చేయడానికి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కాగా, యూఏఈ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్యం కలిగిన అధిక నికర విలువ కలిగిన భారతీయులు, ఇతర దేశస్థులు గల్ఫ్ దేశంలో దీర్ఘకాలిక నివాస సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి