Share News

US Visa: వీసా హక్కు కాదు.. ప్రత్యేక అధికారం మాత్రమే

ABN , Publish Date - Jul 17 , 2025 | 06:13 AM

తమ దేశ వీసా కలిగిఉన్న వారికి అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. వీసా హక్కు కాదని, అదొక ప్రత్యేక అధికారం మాత్రమేనని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.

US Visa: వీసా హక్కు కాదు.. ప్రత్యేక అధికారం మాత్రమే

  • నిబంధనలు ఉల్లంఘిస్తే బహిష్కరణ తప్పదు

  • యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్చరిక

న్యూఢిల్లీ, జూలై 16: తమ దేశ వీసా కలిగిఉన్న వారికి అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. వీసా హక్కు కాదని, అదొక ప్రత్యేక అధికారం మాత్రమేనని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. తమ దేశ చట్టాలను ఉల్లంఘించిన వారి వీసాను రద్దుచేస్తామని హెచ్చరించింది. అలాగే అమెరికాలో ఉన్న సమయంలో దాడులు, గృహహింస, ఇతర తీవ్రమైన నేరాల్లో ఎవరైనా అరెస్టు అయితే వెంటనే వారి వీసాను రద్దు చేస్తామని, భవిష్యత్‌లో కూడా వారికి వీసా అర్హత ఉండదని ఆ ప్రకటనలో తేల్చి చెప్పింది. గత శనివారం భారత్‌లోని అమెరికా ఎంబసీ కూడా ఇలాంటి హెచ్చరిక ఒకటి జారీ చేసింది. ఇదిలా ఉండగా, సామాజిక మాధ్యమాల ఖాతాలు పబ్లిక్‌లో ఉంచకపోతే వీసా దరఖాస్తులను అమెరికా అధికారులు తిరస్కరిస్తున్నారు. రెడిట్‌ ఖాతా వివరాలు ఇవ్వడంలో విఫలమైన ఓ భారతీయ విద్యార్థి దరఖాస్తును అమెరికా అధికారులు తిరస్కరించిన ఘటన ఇటీవల జరిగింది. ఆ వివరాలను ఆ విద్యార్థి సోషల్‌ మీడియాలో వివరించి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘ఇటీవలే ఎఫ్‌-1 వీసా ఇంటర్వ్యూకు వెళ్లాను. నా రెడిట్‌ ఖాతా వివరాలను డీఎస్‌-160 ఫామ్‌లో పేర్కొనలేదు. ఆ ఖాతా గురించి వీసా ఆఫీసర్‌ అడిగారు. ఆ ఖాతా పబ్లిక్‌లోనే ఉంది. దానిలో ఎలాంటి హింసాత్మక కంటెంట్‌ కూడా లేదు. అయినా దరఖాస్తుకు క్లియరెన్స్‌ ఇవ్వలేదు. 221(జి) స్లిప్పు ఇచ్చారు’’ అని వివరించాడు. అయితే తాత్కాలికంగా తిరస్కరించిన దరఖాస్తులకు 221 (జి) స్లిప్పులు ఇస్తారు. అంటే పూర్తిగా తిరస్కరించినట్లు కాదు. వీసా దరఖాస్తులకు అదనపు వివరాలు అవసరమని, వాటిని తొందరగా సమర్పించాల్సి ఉంటుందని, దీనివల్ల వీసా జారీ జాప్యం అవుతుంది నిపుణులు చెప్పారు.


మొత్తం 17 మంది జడ్జిలపై వేటు

వలసదారులను సామూహికంగా బహిష్కరిస్తున్న ట్రంప్‌ ప్రభుత్వం కారణాలేవీ లేకుండా ఇటీవల కాలంలో 17 మంది ఇమ్మిగ్రేషన్‌ కోర్టు జడ్జిలను తొలగించిందని ఓ యూనియన్‌ విమర్శించింది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో శుక్రవారం 15 మంది జడ్జిలను, సోమవారం ఇద్దరిని విధుల నుంచి తొలగించారని జడ్జిలు, ఇతర నిపుణులు ప్రాతినిధ్యం వహించే అంతర్జాతీయ ప్రొఫెషనల్‌ అండ్‌ టెక్నికల్‌ ఇంజనీర్స్‌ సమాఖ్య ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - Jul 17 , 2025 | 06:13 AM