UPI: 15 సెకన్లలోనే యూపీఐలో నగదు బదిలీ
ABN , Publish Date - Jun 17 , 2025 | 06:21 AM
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర యూపీఐ వినియోగదారులకు శుభవార్త. దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు ఇక నుంచి 15సెకన్లలోనే పూర్తవుతాయి.

న్యూఢిల్లీ, జూన్ 16: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర యూపీఐ వినియోగదారులకు శుభవార్త. దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలు ఇక నుంచి 15సెకన్లలోనే పూర్తవుతాయి. యూపీఐ లావాదేవీలు ప్రాసెస్ కావడానికి పట్టే సమయం తగ్గేలా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. సోమవారం నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు యూపీఐ ద్వారా నగదు బదిలీ, స్వీకరణకు సాధారణంగా 30 సెకన్ల వరకు సమయం పట్టేది.
గతంలో చెల్లింపులు ఆగిపోయినపుడు నగదు డెబిట్ అయిందా లేక తిరిగి జమ అయిందా అని తెలియడానికి 30 సెకన్లు, అంతకంటే ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు 10 సెకన్లలోనే ఆ వివరాలు తెలిసిపోతాయి. అలాగే బ్యాంకులు, చెల్లింపు యాప్‌లు పెండింగ్ లేదా నిలిచిపోయిన లావాదేవీల వివరాలను ధ్రువీకరించడానికి 90 సెకన్ల వరకు పట్టగా, ఇప్పుడు 45 నుంచి 60 సెకన్లు మాత్రమే తీసుకుంటుంది.