Share News

UK F-35: ఎఫ్-35 జెట్‌ను స్వదేశానికి తరలించనున్న బ్రిటన్.. చిన్న భాగాలుగా విడగొట్టి..

ABN , Publish Date - Jul 03 , 2025 | 03:28 PM

కేరళలో సాంకేతిక లోపంతో నిలిచిపోయిన ఎఫ్-35ని రిపేర్ చేయడం కష్టమని రాయల్ నేవీ భావిస్తున్నట్టు సమాచారం. విమానాన్ని భాగాలుగా విడగొట్టి స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

UK F-35: ఎఫ్-35 జెట్‌ను స్వదేశానికి తరలించనున్న బ్రిటన్.. చిన్న భాగాలుగా విడగొట్టి..
UK F-35 Jet To Be Dismantled in Kerala

ఇంటర్నెట్ డెస్క్: గత పదిహేను రోజులుగా తిరువనంతపురం ఎయిర్‌‌పోర్టులో నిలిపి ఉంచిన యూకే యుద్ధ విమానం ఎఫ్-35ని రిపేర్ చేయడం సాధ్యం కాదని బ్రిటన్ రాయల్ నేవీ అంచనాకు వచ్చింది. ఈ ఫైటర్ జెట్‌ను చిన్న భాగాలుగా విడగొట్టి కార్గో విమానంలో స్వదేశానికి తరలించేందుకు బ్రిటన్ రాయల్ నేవీ నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి (UK F-35 to be dismantled).

పదిహేను రోజుల క్రితం ఈ యుద్ధ విమానాన్ని బ్రిటన్ పైలట్ అత్యవసరంగా తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో దించాల్సి వచ్చింది. విమానాశ్రయంలోనే ఫైటర్‌ జెట్‌కు మరమ్మతు చేయాలని బ్రిటన్ నావికాదళం తొలుత భావించింది. కానీ ఈ దిశగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో, మరో ప్రత్యామ్నాయం లేక విమానాన్ని భాగాలుగా విడదీసి కార్గో ప్లేన్‌లో స్వదేశానికి తరలించాలని బ్రిటన్ రాయల్ నేవీ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇంతకు మించి మరో మార్గం లేదని బ్రిటన్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.


బ్రిటన్ నావికాదళానికి చెందిన హెచ్‌ఎమ్‌ఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగమైన ఈ ఫైటర్ జెట్.. జూన్ 12న కేరళకు 100 నాటికల్ మైల్స్ దూరంలో సాధారణ మిషన్‌‌లో ఉండగా సమస్యలు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణానికి తోడు, ఇంధనం తక్కువగా ఉన్నట్టు పైలట్‌కు సంకేతాలు అందాయి. దీంతో, పైలట్ భారత వర్గాలకు సమాచారం అందించారు. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఈ క్రమంలో భారత్ ఎయిర్ ఫోర్స్.. ఎఫ్-35ని కేరళలో దించేందుకు సహాయమందించింది. ఆ తరువాత తిరుగుప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో తనిఖీలు చేస్తుండగా విమానంలో హైడ్రాలిక్ వ్యవస్థలో లోపం బయటపడింది. బ్రిటన్ నేవీకి చెందిన టెక్నీషియన్లు లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. సంక్లిష్టమైన సమస్య కావడంతో రిపేరింగ్ కష్టంగా మారింది.


భద్రతా కారణాల రీత్యా ఈ ఫైటర్ జెట్‌ను రాయల్ నేవీ విమానాశ్రయంలోని టార్మాక్‌పైనే చాలా రోజుల పాటు నిలిపి ఉంచింది. హ్యాంగర్‌కు తరలించేందుకు వెనకాడింది. ఇటీవలే దాన్ని రిపేర్ల కోసం హ్యాంగర్‌లోకి చేర్చారు. ఇక మరమ్మతులు సాధ్యం కావన్న అంచనాకు వచ్చిన బ్రిటన్ ఈ విమానాన్ని చిన్న భాగాలుగా విడదీసి స్వదేశానికి తరలించేందుకు నిశ్చయించింది.

ఇవి కూడా చదవండి:

ఐఏఎస్ అని చెప్పుకుంటూ దర్జాగా కారులో షికార్లు.. పోలీసులకు చిక్కిన నిందితుడు

అగ్ని-5 బంకర్ బస్టర్ మిసైల్ అభివృద్ధికి నడుం కట్టిన డీఆర్‌డీఓ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 03:50 PM