Share News

Uddhav Sena: స్టాలిన్ పోరాటం వేరు..మాది పరిమితమైన హిందీ వ్యతిరేకతే

ABN , Publish Date - Jul 06 , 2025 | 05:50 PM

హిందీని బలవంతంగా రుద్దడంపై రెండు దశాబ్దాలుగా కేంద్రతో విభేదిస్తున్న స్టాలిన్ శనివారంనాడు ఒక ట్వీట్‌లో ఉద్ధవ్, రాజ్ ఒకే వేదికపై కలుసుకోవడం, విజయోత్సవం జరుపుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ సోదరులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.

Uddhav Sena: స్టాలిన్ పోరాటం వేరు..మాది పరిమితమైన హిందీ వ్యతిరేకతే
Thackeray Brothers and MK Stalin

ముంబై: ఇరవై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఠాక్రే సోదరులు ఉద్ధవ్, రాజ్ తొలిసారి మరాఠీ విజయోత్సవ వేడుకల్లో వేదికను పంచుకోవడం అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయనే సంకేతాలను ఠాక్రే సోదరుల వ్యాఖ్యలు అందించాయి. ఇదే సమయంలో భాషాపరమైన హక్కుల కోసం డీఎంకే చేస్తున్న పోరాటం రాష్ట్రాల ఎల్లలు దాటి మహారాష్ట్రలో నిరసనల ప్రకంపనలు సృష్టించాయంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. ఠాక్రే సోదరులను అభినందించారు. దీనిపై ఉద్ధవ్ శివసేన తాజాగా స్పందించింది. హిందీ ఆంశంపై తమ వైఖరి, తమిళనాడు సీఎం వైఖరి వేర్వేరని, తాము హిందీకి వ్యతిరేకం కాదని, తమ వ్యతిరేకత పరిమితమైనదని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ తెలిపారు.


'హిందీపై వారి (డీఎంకే) వ్యతిరేకత వేరు. హిందీ మాట్లాడం, ఎవరినీ మాట్లాడనీయమనే విధానం వారిది. కానీ ఇక్కడ మహారాష్ట్రలో అది మా విధానం కాదు. మేము హిందీ మాట్లాడతాం. కానీ ప్రాథమిక పాఠశాలల్లో హిందీని బలవంతంగా రుద్దడానికి మేము వ్యతిరేకం. మా పోరాటం ఇంతవరకే పరిమితం' అని సంజయ్ రౌత్ చెప్పారు. హిందీ మాట్లాడకుండా తాము ఎవరినీ అడ్డుకోమని, తమకు హిందీ సినిమాలు, హిందీ థియేటర్లు, హిందీ మ్యూజిక్ ఇక్కడ ఉన్నాయని రౌత్ వివరించారు. కేవలం ప్రైమరీ పాఠశాలల్లో హిందీని బలవంతంగా రుద్దరాదన్నదే తమ పోరాటమని చెప్పారు.


స్టాలిన్ ట్వీట్ ఇదే..

హిందీని బలవంతంగా రుద్దడంపై రెండు దశాబ్దాలుగా కేంద్రతో విభేదిస్తున్న స్టాలిన్ శనివారంనాడు ఒక ట్వీట్‌లో ఉద్ధవ్, రాజ్ ఒకే వేదికపై కలుసుకోవడం, విజయోత్సవం జరుపుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ సోదరులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. భాషాపరమైన హక్కుల కోసం డీఎంకే దశాబ్దాలుగా పోరాటం సాగించి, ఆ ప్రయత్నాలను తిప్పికొడుతోందని, ఇప్పుడు రాష్ట్రాల ఎల్లలు దాటి మహారాష్ట్రలో నిరసనలు వెల్లువెత్తాయని అన్నారు. హిందీ ఇంపొజిషన్‌కు వ్యతిరేకంగా సోదరుడు ఉద్దవ్ నాయకత్వంలో విక్టరీ ర్యాలీ జరగడం ఎంతో ఉత్సుకత కలిగించిందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

22 రోజుల తర్వాత హ్యాంగర్‌కు తరలించిన ఎఫ్-35 ఫైటర్ జెట్

బీహార్‌ను నేరాల రాజధానిగా మార్చేశారు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 07:38 PM