Trump Comments: రష్యా చమురు కొనుగోళ్లను.. భారత్ ఆపేస్తోంది!
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:53 AM
భారత్, రష్యాలవి పతన ఆర్థిక వ్యవస్థలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఏకపక్ష వ్యాఖ్యలు చేశారు.

ఇదో మంచి ముందడుగు: ట్రంప్
అది అవాస్తవం: విదేశాంగ అధికారులు
వాషింగ్టన్/న్యూఢిల్లీ, ఆగస్టు 2: భారత్, రష్యాలవి పతన ఆర్థిక వ్యవస్థలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఏకపక్ష వ్యాఖ్యలు చేశారు. ‘రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపేస్తోందంటూ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం అమెరికాలోని వాషింగ్టన్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తున్నట్టు నాకు సమాచారం వచ్చింది. అది సరైనదేనా, కాదా అనేది తెలియదు. కానీ ఒక మంచి ముందడుగు. ఏం జరుగుతుందో చూద్దాం..’’ అని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చిన అమెరికా.. అందుకు అంగీకరించకపోవడంతో భారత్‌పై 25శాతం అదనపు సుంకాలు, జరిమానాలు విధిస్తున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ అధికార వర్గాలు ఖండించాయి. ‘‘భారత ప్రయోజనాలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రష్యా నుంచి చమురు, ఇతర ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేసే దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు..’’ అని తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.
రాయితీలు తగ్గడంతో కొనుగోళ్లపై ప్రభావం?
వాస్తవానికి అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా తన చమురును అమ్ముకోవడానికి రాయితీ (డిస్కౌంట్)లు ఇస్తోంది. దీనితో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు గత మూడు, నాలుగేళ్లలో భారీగా పెరిగాయి. కానీ ఇటీవల రష్యా తన రాయితీలను తగ్గించడం, రవాణా సమస్యలతో.. భారత రిఫైనరీలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గిస్తూ వస్తున్నాయని పలు గణాంకాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటివి దాదాపుగా రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేశాయని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి
ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్
Read latest Telangana News And Telugu News