Share News

దివ్యాంగుల కోసం ‘ప్రత్యేకం’

ABN , Publish Date - Jun 15 , 2025 | 06:02 AM

రవాణా వ్యవస్థలో దివ్యాంగులకు మరిన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలు రూపొందించారు.

దివ్యాంగుల కోసం ‘ప్రత్యేకం’

రవాణా వ్యవస్థలో విస్తృత మార్పులు.. బస్సులు, మెట్రోల్లో వీల్‌చైర్‌కు స్థలం

  • రైళ్లు, విమానాల్లోనూ సదుపాయాలు

  • ప్రతిపాదనలతో ముసాయిదా సిద్ధం

న్యూఢిల్లీ, జూన్‌ 14: రవాణా వ్యవస్థలో దివ్యాంగులకు మరిన్ని సదుపాయాలు కల్పించడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలు రూపొందించారు. ‘ట్రాన్స్‌పోర్టు యాక్సె్‌సబిలిటీ ఫ్రేమ్‌వర్క్‌’ పేరుతో స్ట్రాటజిక్‌ యాక్సె్‌సబిలిటీ సెల్‌-రైట్స్‌ ఆఫ్‌ రైడర్స్‌ (ఎస్‌ఏసీ-ఆర్‌ఆర్‌) తయారు చేసిన ఆ ముసాయిదాపై అభిప్రాయాలను సామాజిక న్యాయం, సాధికారత శాఖ పరిధిలోని దివ్యాంగుల సాధికారత విభాగం (డీఈపీడబ్ల్యూడీ) సేకరిస్తోంది. వాటాదారులు, సాధారణ ప్రజల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానించింది. ఈ పక్రియ పూర్తయిన తర్వాత తుది మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఇక ముసాయిదాలో టికెట్‌ బుకింగ్‌ నుంచి బోర్డింగ్‌ వరకు దివ్యాంగుల కోసం బస్సులు, రైళ్లు తదితర రవాణా వ్యవస్థలో విస్తృత మార్పులు చేయాలని సూచించారు. బస్సులు, మెట్రో రైళ్లలో వీల్‌ చైర్‌ కోసం కచ్చితంగా స్థలం కేటాయించాలని, స్టేషన్లలో మెట్లులేని టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, అలాగే ర్యాంపులు నిర్మించాలని, విమాన, రైలు, రోడ్డు ట్రాన్స్‌పోర్టు వ్యవస్థలో శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.


ఆ ముసాయిదాలో ఏమున్నాయి..

  • చాలా అంశాలు మార్చకూడనివిగా పేర్కొన్నారు. అంటే ఒక్కసారి మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత వాటిలో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉండదు.

  • దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అనుసరించి పలు మార్పులు సూచించారు.

  • సెంట్రల్‌ స్కీం కింద తీసుకునే కొత్త బస్సుల్లో కచ్చితంగా లోఫ్లోర్‌ ప్రవేశద్వారం ఉండాలి. అలాగే ర్యాంపులు, సేఫ్టీ బెల్టులు, వీల్‌ చైర్‌ స్థానం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

  • ఇప్పటికే ఉన్న పీఎం ఈబస్‌ సేవ, టైప్‌ 3 ఇంటర్‌సిటీ వంటి బస్సుల్లో చిన్న లిఫ్ట్‌లు లేదా బ్రిడ్జి ర్యాంపులు ఏర్పాటు చేయాలి. ప్రతి బస్సులో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నాలుగు సీట్లు కేటాయించాలి. వాటికి సీటు బెల్టులు ఉండాలి.

  • మెట్రో, సాధారణ రైళ్ల ఫ్లాట్‌ఫారాల్లో రబ్బర్‌ గ్యాప్‌ ఫిల్లర్స్‌ ఏర్పాటు చేయాలి. అలాగే వీల్‌ చైర్లు పట్టేలా డోర్లు వెడల్పు చేయాలి.

  • దూరప్రయాణ రైళ్లలో కనీసం ఒక కోచ్‌లో దివ్యాంగులు వీల్‌చైర్‌ ఉంచేందుకు ఏర్పాట్లు చేయాలి. అలాగే టైప్‌-ఏ టాయిలెట్‌ కూడా అందుబాటులో ఉండాలి.

  • ఎయిర్‌పోర్టుల్లో కూడా పార్కింగ్‌ నుంచి చెకిన్‌ వరకు స్టెప్‌-ఫ్రీ యాక్సె్‌సబిలిటీ ఉండాలి. దివ్యాంగులు కూర్చునేందుకు వీలుగా ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేయాలి. అలాగే దివ్యాంగుల పరికరాలు పెట్టుకునేందుకు తగిన స్థలం కేటాయించాలి.

  • ట్యాక్సీలు, ఈ రిక్షాలు నడిపే సంస్థలు కూడా కొన్నింటిని దివ్యాంగులకు అనుకూలంగా మార్చాలి. రోప్‌ వేలను, ఫెర్రీలను కూడా ఈ పరిధిలోకి తీసుకొచ్చారు.

  • ఫిర్యాదుల కోసం యాప్స్‌, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలను అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలి. మార్పులు చేర్పులకు అనుగుణంగా వాహన చట్టం, అర్బన్‌ బస్‌ నిర్మాణం తదితర నిబంధనలు వెంటనే మార్చాలి.

Updated Date - Jun 15 , 2025 | 06:02 AM