Share News

జగన్నాథ రథయాత్రలో విషాదం

ABN , Publish Date - Jun 30 , 2025 | 05:22 AM

ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుండిచా ఆలయ సమీపంలో...

జగన్నాథ రథయాత్రలో విషాదం

గుడించా ఆలయం వద్ద తొక్కిసలాట

ముగ్గురి మృతి, 50 మందికి గాయాలు

ఆరుగురి పరిస్థితి విషమం: కలెక్టర్‌

భక్తులకు క్షమాపణలు చెప్పిన ఒడిసా సీఎం

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు

పూరీ/భువనేశ్వర్‌, జూన్‌ 29: ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గుండిచా ఆలయ సమీపంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతిచెందగా, దాదాపు 50 మంది గాయపడ్డారు. రథాల్లో కొలువైన దేవతామూర్తులను చూడటానికి వందలాది మంది భక్తులు ఒక్కసారిగా తోసుకుంటూ ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని పూరీ జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌ శంకర్‌ స్వైన్‌ తెలిపారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు. పూజా సామగ్రిని తీసుకువెళ్తున్న రెండు ట్రక్కులు రథాల సమీపంలో రద్దీగా ఉన్న ప్రదేశంలోకి ప్రవేశించడంతో గందరగోళం మొదలైందని అధికారులు పేర్కొన్నారు. సంప్రదాయంలో భాగంగా దేవతామూర్తుల మొహాలపై కప్పి ఉంచిన వస్త్రాన్ని (పహుదా) తొలగించే సమయంలో స్వామిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. మృతులను బసంతి సాహు (36), ప్రేమకాంత్‌ మొహంతి(80), ప్రవాతి దాస్‌ (42)గా గుర్తించారు.


ఈ దుర్ఘటనపై ఒడిశా సీఎం మోహన్‌ మాఝీ స్పందించారు. ప్రభుత్వం తరఫున భక్తులను క్షమాపణలు కోరారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. తొక్కిసలాట ఘటన అత్యంత విషాదకరమని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఒడిశా ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కోరారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 05:22 AM