Journey Depends on Luck: ఈ జర్నీ అదృష్టం మీద బేసై ఉంటుంది
ABN , Publish Date - Jun 30 , 2025 | 07:45 PM
అది.. రూ. 100 కోట్ల ఖర్చుతో వేసిన రోడ్డు. ఇంకేముంది.. నా దారి రహదారనుకుంటూ మీ కారు, లేదా బైక్ మీద రయ్యున వెళ్లిపోదాం అనుకుంటారు కదా. అయితే, ఇక్కడ చిన్న చిక్కు ఉంది. ఆ జర్నీ మీ జాతక చక్రం మీద, లేదంటే, మీకున్న లైఫ్ లైన్ మీద ఆధారపడి ఉంటుంది.

ఇంటర్నెట్ డెస్క్: 100 కోట్ల ఖర్చుతో మీ ప్రాంతంలో కొత్త రోడ్డు నిర్మాణం జరిగిందనుకోండి.. ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మీ కారు, లేదా బైక్ మీద రయ్యున వెళ్లిపోదాం అనుకుంటారు కదా. అయితే, ఆ రోడ్డు మధ్య, మధ్యన పెద్ద, పెద్ద చెట్లు అడ్డంగా, అడ్డుగా ఉంటే ఏంటి పరిస్థితి? అదీ రాత్రివేళల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడైతే.. మన ప్రాణాలు లేదా లైఫ్ లైన్ కేవలం అదృష్టం మీద బేసై ఉంటుంది. తేడా వస్తే, ఇంతే సంగతులు, చిత్తగించవలెను అవుతుంది పరిస్థితి.
కొత్త రోడ్లంటున్నారు, మధ్యలో చెట్లంటున్నారు ఏంటీ వింత పరిస్థితి. అనేగా మీ డౌట్. ఇది నిజమే. బీహార్‌లో జనాలకి ఇప్పుడీ పరిస్థితి తలెత్తింది. రాజధాని పాట్నా నుండి 50 కి.మీ దూరంలో ఉన్న జెహానాబాద్‌లో ఈ వింత నిజమైంది. ఇక్కడ రూ. 100 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ కామెడీ ఎంట్రీ, ట్రాజెడీ ఎండిగ్‌లా మారింది.
ఇటీవల జెహానాబాద్‌లో పాట్నా-గయా ప్రధాన రహదారిపై, 7.48 కి.మీ పొడవైన రోడ్డు నిర్మాణం చేశారు. అయితే, రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్ల తీసివేయకుండా ఎక్కడున్న చెట్లను అక్కడే ఉంచి రోడ్డు వేసేశారు. చెట్లు కొట్టాలంటే చేతులు రాలేదేమో అనుకుంటున్నారా.. అది కాదిక్కడ సమస్య.
జిల్లా యంత్రాంగం రూ. 100 కోట్లతో రోడ్డు విస్తరణ ప్రాజెక్టును చేపట్టినప్పుడు వారు చెట్లను తొలగించడానికి అనుమతి కోరుతూ అటవీ శాఖను సంప్రదించారు. కానీ వారి డిమాండ్ తిరస్కరించిన అటవీ శాఖ.. ప్రతిగా, 14 హెక్టార్ల అటవీ భూమికి పరిహారం డిమాండ్ చేసింది. అయితే, జిల్లా యంత్రాంగం ఆ అభ్యర్థనను నెరవేర్చలేకపోయింది. దీంతో వాళ్లు ఈ వింత నిర్ణయానికి వచ్చి అమలు చేసేశారు. ఎక్కడున్న చెట్లను అక్కడే ఉంచి వాటి చుట్టూ రోడ్డు వేసి మమ.! అనిపించేశారు.
ఇదే ఇప్పుడు రోడ్లపై ప్రమాదాలకు కారణమవుతోంది. దీంతో స్థానిక ప్రజలు ఏంటీ నిర్లక్ష్యపు వ్యవహారమంటూ మండిపడుతున్నారు. కొత్త రోడ్డు మీద బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇకనైనా అధికార యంత్రాంగం ఈ సమస్యపై దృష్టి సారించి రోడ్లకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి, రోడ్ల పక్కన చెట్లు పెంచాలని కోరుతున్నారు. అంతేకాదు, ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ నిలదీస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఐదేళ్లు పక్కా... సీఎం, డిప్యూటీ సీఎం ఐక్యతారాగం
కూలిన ఐదంతస్తుల భవంతి, ప్రమాదకర స్థితిలో మరిన్ని..
For National News And Telugu News