Instagram Reels: ఇన్‌స్టా రీల్స్ చేస్తోందని టెన్నిస్ క్రీడాకారిణిని కాల్చి చంపిన తండ్రి
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:49 AM
యూపీలోని గురుగ్రామ్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ 25 దారుణహత్యకు గురయ్యారు.

లఖ్‌నవూ, జూలై 10: యూపీలోని గురుగ్రామ్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ (25) దారుణహత్యకు గురయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఆమె అదేపనిగా రీల్స్ చేస్తున్నారని, ఆమె తీరు కారణంగా తెలిసిన వాళ్ల ఎదుట తలెత్తుకోలేకపోతున్నాననే కారణంతో కన్నతండ్రే ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. గురుగ్రామ్‌లోని ఆమె ఉంటు న్న నివాసంలోనే ఈ ఘటన జరిగింది. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో రాధిక ఎన్నో పతకాలు సాధించారు. ఇటీవల ఆమెకు గాయం కావడంతో ప్రొఫెషనల్ టెన్ని్‌సకు దూరంగా ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభావశీల వ్యక్తిగా ఎదగాలనే లక్ష్యంతో ఆమె కొన్నాళ్లుగా రీల్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్నారు. గురువారం ఉదయం 10:30కు ఇంట్లోనే రాధికపై ఆమె తండ్రి కాల్పులు జరిపాడు. మూడు బులెట్లు ఆమె శరీరంలో దిగాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఎప్పుడూ కూతురు సోషల్ మీడియాలో కనిపిస్తోందంటూ తెలిసిన వాళ్లు వెక్కిరిస్తుండటంతో గత 15 రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని పోలీసుల విచారణలో నిందితుడు చెప్పాడు.