Tamil Nadu Government: స్వయంప్రతిపత్తిపై కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Apr 16 , 2025 | 07:05 AM
తమిళనాడు సర్కారు గవర్నర్‌తో విభేదాల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ 1971లో ఏర్పడిన జస్టిస్ రాజమన్నార్ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర స్వయం ప్రతిపత్తి పరిరక్షణపై నివేదిక రూపొందిస్తుందని, మధ్యంతర నివేదిక వచ్చే జనవరిలో సమర్పిస్తారని తెలిపారు

తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం
గవర్నర్‌తో విభేదాల నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణకు స్టాలిన్ ప్రభుత్వం చర్యలు
జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ
వచ్చే జనవరి కల్లా మధ్యంతర నివేదిక
రెండేళ్లలో సమగ్రమైన నివేదిక రూపకల్పన
చెన్నై, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): గవర్నర్ ఆర్‌ఎన్ రవితో విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి విషయంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్ర న్యాయమైన హక్కుల పరిరక్షణతోపాటు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను పెంపొందించేలా కమిటీ సిఫారసులు చేస్తుందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన శాసనసభలో 110వ నిబంధన కింద ఒక ప్రకటన చేశారు. కమిటీలో ఇండియన్ మారిటైమ్ వర్సిటీ మాజీ వైస్‌చాన్సలర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎం.నాగనాథన్ సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ 1971లో ఏర్పాటైన జస్టిస్ రాజమన్నార్ కమిటీ సిఫారసులను కూడా పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది జనవరిలో మధ్యంతర నివేదికను సమర్పిస్తుందని, రెండేళ్లలో సమగ్రమైన నివేదికను రూపొందిస్తుందని స్టాలిన్ వివరించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించివేస్తోందని,రాష్ట్రాల జాబితాలోని వైద్య, న్యాయ, ఆర్థిక శాఖలను ఉమ్మడి జాబితాలోకి మార్చే ప్రయత్నాలను వేగవంతం చేసిందని స్టాలిన్ ఆరోపించారు.
ఐదు దశాబ్దాలకు మునుపే 1969లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కేంద్ర, రాష్ట్రాల నడుమ సంబంధాలను సమీక్షించడానికి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీవీ రాజమన్నార్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా కేంద్ర-రాష్ట్రాల సంబంధాలపై సమీక్ష జరిపి సమగ్రమైన నివేదికను తయారు చేసి ఆ కమిటీ 1971లో నివేదికను సమర్పించిందన్నారు. ఆ కమిటీ నివేదికను 1974 ఏప్రిల్ 16న శాసనసభలో కరుణానిధి ప్రవేశపెట్టి ఆమోదింపజేశారని చెప్పారు. ఆ తర్వాత కేంద్రప్రభుత్వం 1983లో నియమించిన సర్కారియా కమిటీ చేసిన సిఫారసులతోనూ పెద్దగా ఫలితం లేకపోయిందని స్టాలిన్ వివరించారు. ‘కేవలం తమిళనాడు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మేం అధికార వికేంద్రీకరణ, నిధుల కోసం ఒత్తిడి తేవడం లేదు.. గుజరాత్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు, కశ్మీర్ నుంచి కేరళ వరకే దేశ ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఒత్తిడి తెస్తున్నాం. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై గళం విప్పుతున్న తొలి రాష్ట్రం తమిళనాడు’ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం ఆధారంగా పనిచేస్తున్న భారతదేశంలోని అన్ని రాష్ట్రాల హక్కులను పరిరక్షించడమే కమిటీ ఏర్పాటు ఉద్దేశమని స్టాలిన్ చెప్పారు. మణిపూర్, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక ఆచారాలను కూడా గౌరవించాలనేది తమ అభ్యర్థన అన్నారు. ‘మా మాతృభాష తమిళం పరిరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. అదే సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాతృభాషలు తమ స్వభావాన్ని కోల్పోతుండటంపైనా అంతే ఆందోళన చెందుతున్నాం’ అని స్టాలిన్ పేర్కొన్నారు.