Supreme Court: భారీగా ఓట్లు తొలగిస్తే.. వెంటనే జోక్యం చేసుకుంటాం!
ABN , Publish Date - Jul 30 , 2025 | 06:27 AM
బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది.

ముసాయిదా జాబితాలో తప్పులుంటే.. ఆధారాలతో మా దృష్టికి తీసుకురండి
పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచన
బిహార్ ‘ఎస్‌ఐఆర్’ సవాల్ పిటిషన్లపై ఆగస్టు 12, 13 తేదీల్లో విచారణ
న్యూఢిల్లీ, జూలై 29: బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్‌ఐఆర్‌లో భారీగా ఓట్లు తొలగింపునకు గురైతే.. తాము వెంటనే జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగ సంస్థ అని, అది చట్టప్రకారం పనిచేస్తుందని భావిస్తున్నామని జస్టిస్ సూర్యకాంత మిశ్రా, జస్టిస్ బాగ్చి ధర్మాసనం పేర్కొంది. ఎస్‌ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఆగస్టు 12, 13 తేదీల్లో విచారణ చేపడుతామని పేర్కొంది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఆగస్టు 1న ఎన్నికల కమిషన్ ప్రచురించే ఓటర్ల ముసాయిదా జాబితాలో అనేక మందిని ఓటర్లను తొలగిస్తున్నారని, దీని వలన కీలకమైన వారి ఓటు హక్కును కోల్పోతారని ఆరోపించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ సమయంలో 65 లక్షల మంది ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించలేదని, వారు చనిపోవడమో లేదా వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడమే జరిగిందంటూ ఈసీ ఒక ప్రకటన చేసిందని భూషణ్ పేర్కొన్నారు. వీరంతా ఓటర్ల జాబితాలో చేరడానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ర మిశ్రా స్పందిస్తూ.. ‘ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ఈసీ చట్టప్రకారం నడుచుకుంటుందని భావిస్తున్నాం. ఏమైనా తప్పు జరిగితే, ఆధారాలతో మీరు కోర్టు దృష్టికి తీసుకురండి. మీ వాదనలను వింటాం’ అని స్పష్టం చేశారు. ‘65 లక్షల మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో ఉండవని మీ అనుమానం. ఓటర్ల జాబితాలో సవరణలు చేయాలని ఈసీ కోరుకుంటోంది. ఒకవేళ భారీఎత్తున ఓట్లు తొలగింపునకు గురైతే.. వెంటనే మేం జోక్యం చేసుకుంటాం. వారు చనిపోయారని చెబుతున్న వారిలో 15 మంది బతికున్నట్లుగా మీరు చూపించండి’ అని జస్టిస్ బాగ్చి పేర్కొన్నారు. ఈసీ తరఫున రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత కూడా ఎన్యూమరేషన్ పత్రాలను సమర్పించవచ్చన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై పిటిషనర్లు, ఈసీ ఆగస్టు 8లోగా రాతపూర్వక సమర్పణలు దాఖలు చేయాలని ధర్మాసనం సూచించింది.