Supreme Court: మాజీ భర్తకు బహిరంగ క్షమాపణలు చెప్పండి!
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:55 AM
తప్పుడు కేసులు పెట్టి మాజీ భర్త, అత్తింటి వారిని వేధింపులకు గురి చేసిన ఓ ఐపీఎస్ అధికారిపైసుప్రీంకోర్టు మండిపడింది.

ఐపీఎస్ అధికారి శివంగికి సుప్రీం కోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ, జూలై 23: తప్పుడు కేసులు పెట్టి మాజీ భర్త, అత్తింటి వారిని వేధింపులకు గురి చేసిన ఓ ఐపీఎస్ అధికారిపైసుప్రీంకోర్టు మండిపడింది. సదరు అధికారి, ఆమె తల్లిదండ్రులు.. మాజీ భర్తతోపాటు ఆయన కుటుంబీకులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ ఆదేశించింది. అలాగే పత్రికాముఖంగా క్షమాపణలు చెప్పాలని.. ప్రముఖ జాతీయ ఆంగ్ల, హిందీ దినపత్రికల్లో ఆ విషయాన్ని వెల్లడించాలని.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో కూడా తెలియజేయాలని స్పష్టంచేసింది. ప్రతీకారంతో భవిష్యత్తులో వారిని ఏరకంగానైనా ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. కేసులను తగిన అధికార పరిధికి మార్చాలంటూ ఇరు పక్షాలు నమోదు చేసిన బదిలీ పిటిషన్లను పరిశీలించిన సీజేఐ జస్టిస్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసి్‌హల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శివంగికి 2015లో షాహిబ్ బన్సాల్‌తో వివాహమైంది.
వారికి ఓ కూతురు పుట్టింది. విభేదాలతో వారు 2018 నుంచి విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే పరస్పరం కేసులు పెట్టుకున్నారు. శివంగి పెట్టిన కేసుల్లో గృహహింస, హత్యాయత్నం, అత్యాచారం తదితర అభియోగాలున్నాయని, భర్త షాహిబ్ 109 రోజులు, ఆయన తండ్రి 103రోజులు జైలు శిక్ష అనుభవించినట్లు ధర్మాసనం గుర్తించింది. దీంతో ఆ కుటుంబం ఎంతో మానసిక వేదనకు గురైందని.. దీనికి ఏరకంగానూ పరిహారం చెల్లించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే ఇప్పుడు అందుతున్న భరణంతోపాటు మాజీ భర్త ఆస్తిలో హక్కు వదుకోవాలని శివంగికి షరతు విధించింది. ఈ వ్యవహారంలో నమోదైన అన్ని కేసులను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, అత్తింట్లో వేధింపులు ఎదుర్కొంటూనే శివంగి 2022లో యూపీఎస్సీకి ఎంపికయ్యారని అప్పట్లో పత్రికలు ప్రచురించాయి.