Ayodhya Surya Tilak: అయోధ్యలో కన్నుల పండువగా నవమి వేడుకలు లైవ్..
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:26 PM
అయోధ్య రామ్ లల్లాలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. నేడు ఆలయంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్య భగవానుడు బాలరామునికి తన కిరణాలతో తిలకం దిద్దాడు.

అయోధ్యలో బాలరాముని ఆలయ నిర్మాణం తర్వాత రెండో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. మార్చి 29 నుంచి వసంత నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాముల వారికి అభిషేకం చేస్తున్నారు. ఈ సందర్భంగా భానుడి సూర్యకిరణాలు బాలరాముడి నుదిటిపై తిలకం దిద్దాయి. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు బాల రాముడి నుదిటిపై నాలుగు నిమిషాల పాటు ప్రసరించాయి. ఈ అద్భుతాన్ని చూసి భక్తులందరూ తరించారు. అదే సమయంలో గర్భాలయంలో లైట్లు ఆర్పివేయడంతో సూర్య తిలకం దృశ్యాలు మరింత శోభాయమానంగా వెలుగొందాయి.
సనాతన ధర్మంలో సూర్యుడిని శక్తికి మూలంగా భావిస్తారు. సూర్యుడు తన కిరణాలతో రామునికి తిలకం దిద్దడం వల్ల రామునిలోని దైవత్వం మేల్కొంటుందని విశ్వసిస్తారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు తరలి వచ్చారు.. వస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భక్తులు తమ ఇళ్ల నుంచే ఈ అద్భుతాన్ని చూసి తరిస్తున్నారు.
ఇవాళ అయోధ్యకు దాదాపు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ పలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ప్రత్యేక పాస్‌లను రద్దు చేసింది. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు, తాగునీటి ఏర్పాట్లు, తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలు, ఏడు చోట్ల 108 అంబులెన్సులను సిద్ధం చేసింది. ఇక, డ్రోన్ల సాయంతో సరయూ నది జలాలను భక్తులపై జల్లుతుండటం మరో విశేషం. అయోధ్యలో జరుగుతోన్న బాలరాముని శోభని లైవ్ లో చూద్దాం..
ఈ వార్తలు కూడా చదవండి..
Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు
For More AP News and Telugu News