Emotional Tragedy: నదిలో కుమారుడి గల్లంతు చెరువులో దూకి తల్లి ఆత్మహత్య
ABN , Publish Date - Jul 26 , 2025 | 03:50 AM
భద్ర నదిలో జీపు బోల్తాపడి గణపతికట్టి శమంత్ 22 అనే యువకుడు గల్లంతయ్యాడు..

బెంగళూరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): భద్ర నదిలో జీపు బోల్తాపడి గణపతికట్టి శమంత్(22) అనే యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు, పోలీసులు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైన అతని తల్లి రవికళ(48), గ్రామ సమీపంలోని చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన చిక్కమగళూరు జిల్లాలో చోటు చేసుకుంది. కళస గ్రామానికి చెందిన రవికళ, సమీపంలోని కాఫీ తోటలకు కూలీలను సమకూర్చే మేస్త్రీగా పనిచేసేవారు. కుమారుడికి ఉపాధి కల్పించేందుకు 6నెలలక్రితం జీపును కొనుగోలు చేసిచ్చారు. ఈ క్రమంలో గురువారం కళస-కళకూడ మార్గంలో కోళమగ వద్ద రోడ్డుపక్కనే ప్రవహిస్తున్న భద్ర నదిలో జీపు బోల్తా పడింది. ప్రమాదం గురించి తెలియగానే నది వద్దకు చేరుకున్న తల్లి రవికళ, రాత్రిదాకా అక్కడే కొడుకు కోసం పడిగాపులు కాశారు. చీకటి పడటం, వర్షం కురుస్తుండటంతో అధికారులు గాలింపు చర్యలను ఆపేశారు. తిరిగి శుక్రవారం గాలించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో తల్లి రవికళ రాత్రి ఇంటికి వెళ్లారు. ఆ తరువాత గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News