Parliament Discussions: ఎస్‌ఐఆర్‌పై చర్చకు పట్టు
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:50 AM
బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై చర్చ విషయంలో విపక్షాలు పట్టువీడడం లేదు. ఎస్‌ఐఆర్ అంశం శుక్రవారం

న్యూఢిల్లీ, ఆగస్టు 1: బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై చర్చ విషయంలో విపక్షాలు పట్టువీడడం లేదు. ఎస్‌ఐఆర్ అంశం శుక్రవారం కూడా పార్లమెంట్ ఉభయసభలను కుదిపేసింది. దీంతో విపక్ష సభ్యుల ఆందోళనల నడుమ పలుమార్లు వాయిదా పడుతూ జరిగిన లోక్‌సభ, రాజ్యసభ ఎలాంటి చర్చలు లేకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇక, రాజ్యసభ వెల్‌లోకి దూసుకొచ్చిన సభ్యులను మార్షల్స్ అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. రాజ్యసభను పారామిలటిరీ చేతికి అప్పగించారంటూ కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తొలుత ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశం కాగా స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల నిర్వహణకు సిద్ధమయ్యారు. కానీ ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎస్‌ఐఆర్‌పై చర్చ, ఉపసంహరణకు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండడంతో సభ మొదలైన మూడు నిమిషాలకే మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. రెండు గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత గోవా శాసనసభలో ఎస్టీలకు సీట్లు కేటాయింపునకు సంబంధించిన బిల్లుపై చర్చను స్పీకర్ ప్రతిపాదించగా ప్రతిపక్ష సభ్యులు సహకరించలేదు. మరోపక్క, ఎస్‌ఐఆర్‌పై రాజ్యసభలోనూ ఇదే తరహా ఆందోళనలు కొనసాగగా.. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ జరగకుండానే సభ వాయిదా పడింది. ఇదిలా ఉండగా, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టుగా ఎస్‌ఐఆర్‌పై పార్లమెంట్‌లో చర్చించలేమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు శుక్రవారం తెలిపారు. ఈసీకి సంబంధించిన అంశాలపై పార్లమెంట్‌లో చర్చించలేమంటూ కాంగ్రెస్ నేత, దివంగత బలరాం జాఖర్ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడు ఇచ్చిన ఉత్తర్వులనే తాము అనుసరిస్తున్నామని రిజిజు పేర్కొన్నారు.