Rajnath Singh: సింధ్ భారత్‌లోకి రావచ్చు, సరిహద్దులు మారవచ్చు.. రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 08:53 PM
సింధ్ హిందువులు ముఖ్యంగా ఎల్‌కే అడ్వాణీ వంటి నేతల తరానికి చెందిన వారని, ఇండియా నుంచి సింధ్ ప్రాంతం విడిపోవడాన్ని సింధ్ హిందువులు ఇప్పటికీ అంగీకరించడం లేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
న్యూఢిల్లీ: దేశ సరిహద్దులు మారవచ్చని, పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతం కూడా భారత్‌లోకి తిరిగి రావచ్చని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. నాగరికత పరంగా సింధ్ ఎల్లప్పుడూ భారత్‌లో భాగంగానే ఉంటుందన్నారు. ఆదివారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సింధ్ భూమి నేడు భారత్‌లో భాగం కాకపోవచ్చని, కానీ నాగరికత పరంగా సింధ్ ఎల్లప్పుడూ భారతదేశంలో భాగంగా ఉంటుందన్నారు.
సింధూ నది సమీపంలోని సింధ్ ప్రావిన్స్ 1947లో దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లిపోయిందని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు. అక్కడ నివసించే సింధ్ ప్రజలు ఇండియాకు వచ్చారన్నారు. సింధ్ హిందువులు ముఖ్యంగా ఎల్‌కే అడ్వాణీ వంటి నేతలు ఆ తరానికి చెందిన వారని, ఇండియా నుంచి సింధ్ ప్రాంతం విడిపోవడాన్ని సింధ్ హిందువులు ఇప్పటికీ అంగీకరించడం లేదని అన్నారు. ఎల్‌కే అడ్వాణీ తన పుస్తకంలో ఈ విషయం రాసినట్టు చెప్పారు. సింధ్‌లోనే కాదు, ఇండియా అంతటా హిందువులు సింధూ నదిని అతి పవిత్రంగా భావిస్తారని అన్నారు. సింధ్‌లోని చాలామంది ముస్లింలు సైతం సింధూ నది నీరు మక్కాలోని ఆబ్-ఎ-జంజామ్ కంటే తక్కువ పవిత్రమైనది కాదని విశ్వసిస్తారని, ఇది అడ్వాణీ తన పుస్తకంలో ఉటంకించారని చెప్పారు.
'సింధ్ భూమి నేడు భారత్‌లో భాగం కాకపోవచ్చు. నాగరికతపరంగా సింధ్ ఎప్పుడూ భారత్‌లో భాగమే. ఆ భూమికి సంబంధించి సరిహద్దులు మారవచ్చు. ఎవరికి తెలుసు, రేపు సింధ్ ఇండియాకు తిరిగి రావచ్చు. సింధ్ ఎక్కడున్నా అది మనదే' అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎస్ఐఆర్ సంస్కరణ కాదు, బలవంతపు అణచివేత
చండీగఢ్ బిల్లుపై తుది నిర్ణయం తీసుకోలేదు.. కేంద్రం వివరణ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.