Share News

Shubhanshu Shukla: సారే జహాసే అచ్ఛా.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫేర్‌వెల్ పార్టీలో శుభాంశూ శుక్లా సందేశం

ABN , Publish Date - Jul 13 , 2025 | 08:58 PM

యాక్సియమ్-4 మిషన్ ముగింపునకు వచ్చేసింది. భారత వ్యోమగామి శుభాంశూ శుక్లాతో పాటు మిగతా ముగ్గురు వ్యోమగాములు రేపు తిరుగు ప్రయాణం కట్టనున్నారు. భారత కాలమానం ప్రకారం జులై 15 మధ్యాహ్నం మూడు గంటలకు వారు భూమ్మీదకు చేరుకుంటారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Shubhanshu Shukla: సారే జహాసే అచ్ఛా.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫేర్‌వెల్ పార్టీలో శుభాంశూ శుక్లా సందేశం
Shubhanshu Shukla ISS

ఇంటర్నెట్ డెస్క్: యాక్సియమ్-4 మిషన్ ముగింపునకు వచ్చేసింది. ఈ మిషన్‌లో భాగంగా దాదాపు రెండు వారాల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వివిధ రకాల ప్రయోగాలు నిర్వహించిన భారతీయ ఆస్ట్రొనాట్ శుభాంశూ శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు రేపు తిరుగుప్రయాణం మొదలెడతారు. ఈ క్రమంలో యాక్సియమ్-4 బృందం కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తాజాగా (ఐఎస్ఎస్‌) ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఆరు దేశాలకు చెందిన వివిధ ఫుడ్స్‌ను యాక్సియమ్-4 వ్యోమగాములు రుచి చూశారు. ప్రస్తుతం ఐఎస్ఎస్‌లో యాక్సియమ్-4 సభ్యులతో పాటు ఎక్సిపిడిషన్-73కి చెందిన ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన శుభాంశూ శుక్లా తన దేశభక్తిని చాటుకున్నారు. ప్రపంచంలోకెల్లా భారత్ అద్భుతమైన దేశమని కీర్తించారు. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించిందని అన్నారు. అంతరిక్షం నుంచి చూస్తుంటే భారత్ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ కనిపిస్తోందని అన్నారు. యాక్సియమ్-4 విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయాణం తనకు అద్భుత అనుభూతిని మిగిల్చిందని అన్నారు.


ఈ మిషన్‌‌ భాగస్వాములైన కమాండర్ పెగ్గీ విట్సన్, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ యుజాన్స్కీ, హంగరీ వ్యోమగామి టిబోర్ కాపూపై కూడా ప్రశంసలు కురిపించారు. వారి కారణంగానే ఈ జర్నీ అద్భుత అనుభూతిని ఇచ్చిందని అన్నారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇస్రో పరిశోధకులు, విద్యార్థులు, నాసా, యాక్సియమ్ సంస్థలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో మధుర స్మృతులు, అనుభవాలను మూటగట్టుకుని తిరుగు ప్రయాణమవుతున్నట్టు చెప్పారు.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపిన వివరాల ప్రకారం, నలుగురు వ్యోమగాములతో కూడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక జూన్ 14న ఈస్టర్న్ డే లైట్ టైమ్ ప్రకారం (అమెరికాలోని ఫ్లోరిడా కాలమానం) ఉదయం 7.05 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి అన్‌డాక్ (విడివడటం) కానుంది. జులై 15న మధ్యాహ్నం మూడు గంటలకు శుభాంశూ శుక్లా భూమ్మీదకు చేరుతారని కేంద్ర మంత్రి జితేంత్ర సింగ్ ఎక్స్ వేదికగా తెలిపారు.


జూన్ 25న యాక్సియమ్-4 మిషన్ సభ్యులు ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఐఎస్ఎస్‌కు బయలుదేరిన విషయం తెలిసిందే. దాదాపు 28 గంటల ప్రయాణం అనంతరం జూన్ 26న ఐఎస్ఎస్‌ను చేరుకున్నారు. అక్కడ దాదాపు రెండు వారాల పాటు వివిధ రకాల ప్రయోగాలు నిర్వహించారు. వాతావరణం అనుకూలిస్తే రేపు వారు తిరుగు ప్రయాణమవుతారని నాసా వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

మహారాష్ట్రలో మరో కలకలం.. హిందీలోనే మాట్లాడతానన్న ఆటో డ్రైవర్‌పై దాడి

గ్రామంలో రోడ్లు లేవంటూ సోషల్ మీడియాలో గర్భిణుల నిరసన.. ఎంపీ రెస్పాన్స్ చూస్తే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 09:10 PM