IT Returns-Crypto: క్రిప్టో అలర్ట్: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? పన్నుల వివరాలివే..
ABN , Publish Date - Jul 28 , 2025 | 04:51 PM
2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి షెడ్యూల్ చేయబడిన క్రిప్టో ఆస్తులను కూడా ఆదాయపు పన్నులో ఫైల్ చేయాల్సి ఉంటుందని ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ క్రమంలో క్రిప్టో లాభాలపై పన్ను అత్యధికంగా..

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారతదేశంలో ఆదాయపు పన్ను శాఖ క్రిప్టో పెట్టుబడులు, ట్రేడింగ్ మీద దృష్టి పెట్టింది. అనుమతించబడిన పెట్టుబడి సాధనంగా క్రిప్టో అసెట్ క్లాస్ మారటంతో పెట్టుబడి దారులు దీనిపై ట్యాక్స్ రూల్స్ తెలుసుకోవాల్సిఉంది. 2022లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తొలిసారిగా 'వర్చువల్ డిజిటల్ అసెట్స్ అనే క్లాస్' అనే మాట ఉదహరించారు. అంతేకాదు, ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 115 బీబీహెచ్(BBH) కింద వీటిని చేర్చారు.
దీంతో, క్రిప్టో పెట్టుబడుల నుండి వచ్చే లాభాలు ఆదాయపు పన్ను రిటర్న్స్ లో చూపించాలి. భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ లావాదేవీలను వర్చువల్ డిజిటల్ ఆస్తుల (VDAs)గా వర్గీకరిస్తుంది. దీనిపై 2022 నుండి స్పష్టమైన పన్ను నిబంధనలు అమలులో ఉన్నాయి. క్రిప్టోకరెన్సీ లావాదేవీల నుండి వచ్చే లాభాలు క్యాపిటల్ గెయిన్స్ లేదా ఇతర ఆదాయ వనరులు కింద పరిగణిస్తున్నారు. ఇవి, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ (36 నెలల కంటే తక్కువ కాలంలో వచ్చిన లాభాలు), దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (36 నెలల కంటే ఎక్కువ కాలంలో వచ్చిన లాభాలు)గా పరిగణిస్తారు. ఇందులో మొదటి దానికి వ్యక్తిగత ఆదాయ స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను విధిస్తారు. రెండవ కోవలోకి వచ్చిన వాటికి 20% రేటుతో ఇండెక్సేషన్ ప్రయోజనంతో పన్ను విధిస్తున్నారు.
క్రిప్టో లాభాలపై అత్యధికంగా 30 శాతం ఫ్లాట్ రేటు పన్నుతో పాటు దానిపై 4 శాతం సెస్, సర్ చార్జ్ కూడా విధిస్తారు. అయితే క్రిప్టో పెట్టుబడి నష్టాలను ఆఫ్ సెట్ చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి అవకాశం కల్పించలేదు. చట్ట ప్రకారం రూ.10వేలకు మించిన క్రిప్టో ట్రాన్సాక్షన్లపై 1 శాతం టీడీఎస్ ను జూలై 1, 2022 నుంచి అమలులోకి తీసుకొచ్చారు. క్రిప్టో కాయిన్లను వస్తుసేవల చెల్లింపులకు వినియోగించినా ఇవే పన్నులు వర్తిస్తాయి.
2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి షెడ్యూల్ చేయబడిన క్రిప్టో ఆస్తులను కూడా ఆదాయపు పన్నులో ఫైల్ చేయాల్సి ఉంటుందని ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ క్రమంలో క్రిప్టో పన్ను నిబంధనలు సంక్లిష్టంగా ఉంటాయి. కావున టాక్స్ ప్రొఫెషనల్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్‌తో సంప్రదించి, మీ లావాదేవీల ఆధారంగా సరైన ఐటీఆర్ ఫైలింగ్ చేయడం బెటర్.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ లిక్కర్ స్కాం ఢిల్లీ స్కాం కంటే పెద్దది: మంత్రి నిమ్మల
రాష్ట్రంలో పాజిటివ్ గవర్నెన్స్: మంత్రి సత్యప్రసాద్
Read latest AndhraPradesh News And Telugu News