Shashi Tharoor: ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ ఎంపీ శశి థరూర్ లేఖ
ABN , Publish Date - May 20 , 2025 | 12:55 PM
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత దేశ చర్యలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు తనను ఎంపిక చేయడంపై ఎంపీ శశి థరూర్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత విదేశాంగ విధానాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు తనను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. భారత్కు ప్రాతినిధ్యం వహించే బాధ్యతను తనపై విశ్వాసంతో అప్పగించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు అన్ని వర్గాల వారిని కలుపుకుని వెళ్లాలన్న కృతనిశ్చయం ప్రధాని నిర్ణయంలో ప్రతిఫలిస్తోందని వ్యాఖ్యానించారు.
సంక్లిష్ట ఆంగ్ల భాషలో లేఖ రాసిన శశి థరూర్.. ప్రస్తుత పరిస్థితులను ప్రతిఫలించేలా పదజాలాన్ని ఎంచుకున్నట్టు వివరించారు. తన తార్కిక, భాషా పటిమకు అనుగుణంగా ప్రధాని మోదీ ఎంపిక ఉందని వ్యాఖ్యానించారు. విమర్శకులను తికమక పెట్టేలా ఉన్న ప్రధాని నిర్ణయం అత్యున్నత పాలనా ప్రమాణాలకు అనుగుణంగా ఉందనీ కితాబునిచ్చారు. మిలిటరీ చర్యల తర్వాత భారత్ వ్యూహాత్మక అవసరాలను ప్రపంచ వేదికలపై వివరించేందుకు తనను, ఇతర ఎంపీలను మోదీ ఎంపిక చేశారని అన్నారు. స్వతంత్ర అభిప్రాయాలున్న వ్యక్తులకు ప్రాధాన్యం ఉంటుందన్న రాజకీయ సంకేతం కూడా ఇందులో ఇమిడి ఉందని తెలిపారు. దౌత్యపరంగానూ ఇది తగిన చర్యని అభిప్రాయపడ్డారు.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన చర్యకు అదే స్థాయిలో సంక్లిష్ట భాషతో జవాబిచ్చానని శశిథరూర్ అన్నారు. భారత్ ఉద్దేశాలు, ఆందోళనను ప్రపంచ దేశాలు అర్థం చేసుకునేలా తన దౌత్య పరిజ్ఞానం, భాషా నైపుణ్యాలతో వెల్లడిస్తానని అన్నారు. వివిధ దేశాల వారికి చేరేలా భారత వాణిని తగిన రీతుల్లో వినిపిస్తానని మాటిచ్చారు. ఈ మిషన్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ భారతదేశ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉంటానని తెలిపారు.
ఆంగ్ల భాషపై ఇంగ్లీష్ సాహిత్యవేత్తలతో సమానమైన పట్టున్న ఎంపీ శశి థరూర్ రాసిన ఈ లేఖ ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకే దారి తీసింది. లేఖలోని పదజాలం, భావాల లోతు, అందులోని నిగూఢార్థాలను మెదడుకు ఎక్కించుకునేందుకు జనాలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. తాము డిక్షనరీలు ముందేసుకుని కూర్చొని లేఖను చదువుతున్నామని కొందరు సెటైర్లు సైతం పేల్చారు.
ఇవీ చదవండి:
ట్రంప్ తన పంతం నెగ్గించుకుంటే.. భారత్కు ఏటా 18 బిలియన్ డాలర్ల నష్టం
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మానవాళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి