Shashi Tharoor: రెక్కలు మీవి, ఎగరడానికి పర్మిషన్ అడక్కండి.. ఖర్గే వ్యాఖ్యలపై శశిథరూర్
ABN , Publish Date - Jun 25 , 2025 | 06:03 PM
శశిథరూర్ తాజాగా ఒక వ్యాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించడం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసింది. ప్రధాని ఇటీవల కేరళలో జరిపిన పర్యటనలో కూడా ఆయన వెంట శశిథరూర్ ఉన్నారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor)పై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) బుధవారంనాడు మీడియా సమావేశంలో ఒకింత హాస్యం జోడించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నాకు ఆంగ్లం చదవడం రాదు, కానీ ఆయన లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. ఆ కారణంగానే ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిని చేశాం' అని నవ్వుతూ చెప్పారు. దీంతో శశిథరూర్‌కు మేథా శక్తి, ప్రపంచ స్థాయిలో సమాచారాన్ని పంచుకునే పరిజ్ఞానం ఉన్నట్టు ఖర్గే పరోక్షంగా చెప్పినట్టయింది.
రాజకీయ విభేదాలున్నా విపక్షాలన్నీ ఇండియన్ ఆర్మీకి వెన్నుదన్నుగా నిలుస్తాయని జాతీయ ఐక్యతా సందేశాన్ని కూడా ఖర్గే తన మాటల్లో ప్రస్ఫుటం చేశారు. తమకు దేశం ముఖ్యమని (నేషన్ ఫస్ట్), తాము పదేపదే ఈ విషయాన్ని చెబుతున్నామని, దేశం కంటే మోదీనే ముఖ్యమని కొందరు వ్యక్తులు నమ్ముతుంటారని పరోక్షంగా బీజేపీపై ఆయన విమర్శలు చేశారు.
శశిథరూర్ తాజాగా ఒక వ్యాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించడం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేసింది. ప్రధాని ఇటీవల కేరళలో జరిపిన పర్యటనలో కూడా ఆయన వెంట శశిథరూర్ ఉన్నారు. ఈ క్రమంలో ఇటు శశిథరూర్‌కు ఉన్న టాలెంట్‌ను, పార్టీ అనుసరిస్తు్న్న జాతీయవాద దృక్పథాన్ని ఖర్గే విలేఖరుల సమావేశంలో ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.
ఆకాశం ఎవరిదీ కాదు.. శశిథరూర్ ట్వీట్
ఖర్గే వ్యాఖ్యల అనంతరం శశిథరూర్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. 'ఎగరడానికి అనుమతి అడక్కండి. రెక్కలు మీవి. ఆకాశం ఏ ఒక్కరిదీ కాదు' అని ఆ ట్వీట్‌లో శశిథరూర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు
రైలు ప్రయాణీకులకు షాక్.. జూలై 1 నుంచి పెరగనున్న టికెట్ ఛార్జీలు..! ఎంతంటే..?
For National News And Telugu News