RSS: అన్ని భాషలూ జాతీయ భాషలే
ABN , Publish Date - Jul 09 , 2025 | 02:53 AM
మహారాష్ట్రలో భాషలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దేశంలోని భాషలన్నీ జాతీయ భాషలేనని ఆరెస్సెస్ స్పష్టం చేసింది.

ఒకే భాషను బలవంతంగా రుద్దటాన్ని మేం సమర్థించం: ఆర్‌ఎస్‌ఎస్
న్యూఢిల్లీ, జూలై 8: మహారాష్ట్రలో భాషలపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దేశంలోని భాషలన్నీ జాతీయ భాషలేనని ఆరెస్సెస్ స్పష్టం చేసింది. ఒకేభాషను బలవంతంగా అమలు చేయడాన్ని సమర్థించేది లేదని ప్రకటించింది. ఇటీవల జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశంలో ఈమేరకు పేర్కొంది. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో హిందీ అమలుపై వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈమేరకు స్పష్టతనిచ్చింది. జాతీయ నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ)లో భాగమైన మూడు భాషల ఫార్ములా నుంచే ఈ వివాదం మొదలైంది. ఎన్‌ఈపీ ద్వారా హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా మహారాష్ట్రలో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ మూడు భాషల ఫార్ములాకి సంబంధించి జారీ చేసిన రెండు ఆదేశాలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది.