Mohan Bhagwat: 75 ఏళ్లు పూర్తయితే దిగిపోవాల్సిందే
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:24 AM
నాయకులు 75 ఏళ్ల వయసు రాగానే పక్కకు తప్పుకోవాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రిటైర్మెంట్ రచ్చను రాజేశాయి.

ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ స్పష్టీకరణ
ఈ ఏడాది సెప్టెంబరు 17తో మోదీకి 75 ఏళ్లు
అదే నెల 11న భాగవత్‌కూ 75 ఏళ్లు
ఇద్దరూ బ్యాగులు సర్దుకోండి.. కాంగ్రెస్ వ్యాఖ్య
న్యూఢిల్లీ, జూలై 11: నాయకులు 75 ఏళ్ల వయసు రాగానే పక్కకు తప్పుకోవాలంటూ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రిటైర్మెంట్ రచ్చను రాజేశాయి. భాగవత్ ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేశారా? లేక వచ్చే సెప్టెంబరు నాటికి 75 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న తన గురించి తానే భాగవత్ ఈ ప్రకటన చేశారా? అంటూ విపక్షాలు ఆశ్చర్యపోతున్నాయి. మరోవైపు బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ మధ్య 2024 ఎన్నికల ముందు మొదలైన ఆధిప్యత పోరు మరింత పాకాన పడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏమైనా జాతీయ రాజకీయ వర్గాలు, ఆర్‌ఎ్‌సఎస్ వ్యవహారాల పరిశీలకులు తాజా పరిమాణాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంత చర్చకు కారణమైన ఘటన.. ఆర్‌ఎ్‌సఎస్ సిద్ధాంత కర్త మోరోపంత్ పింగ్లేకు అంకితం చేస్తూ గత బుధవారం జరిగిన పుస్తక ఆవిష్కరణ సభలో చోటుచేసుకుంది. సభలో ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. ‘‘75 ఏళ్లు ఒంటిమీదకు వచ్చి శాలువా కప్పించుకున్నామంటేనే, వయసు మీరిందని, బాధ్యతల నుంచి తప్పుకొని, మరొకరికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి’ అని పింగ్లే అనేవారు’’ అని తెలిపారు. భాగవత్ ఈ వ్యాఖ్యలు చేసిన సమయం అనేక సందేహాలకు తావిచ్చింది. వచ్చే సెప్టెంబరు 17వ తేదీతో మోదీ, సెప్టెంబరు 11వ తేదీతో భాగవత్ 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. వీరిద్దరూ 1950 సెప్టెంబరులో ఆరు రోజుల తేడాతో జన్మించారు. దీంతో ప్రధానిగా దిగిపోవాల్సిన సమయం వచ్చేసిందని మోదీకి భాగవత్ పరోక్ష సంకేతం అందించారని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ‘‘75 ఏళ్లు పూర్తిచేసుకున్న ఆడ్వాణీ, మురళీమనోహర్ జోషి, జస్వంత్ సింగ్‌లను బాధ్యతల నుంచి తప్పించేదాకా నరేంద్రమోదీ నిద్రపోలేదు. అదే సూత్రాన్ని ఆయన తనకు వర్తింపజేసుకుంటారా?’’ అని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ప్రధానిగా తన పదేళ్లలో మోదీ నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎ్‌సఎస్ కార్యాలయాన్ని తొలిసారి ఈ ఏడాది మార్చిలో సందర్శించినప్పుడు కూడా రౌత్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పట్లో బీజేపీ వాటిని ఖండించింది. బీజేపీ ప్రణాళికలో పదవీ విరమణకు సంబంధించిన నిబంధన లేదని, 2029 వరకు మోదీయే ప్రధానిగా ఉంటారని హోంమంత్రి అమిత్‌షా కూడా స్పష్టం చేశారు.
అయ్యో.. ప్రధాని: కాంగ్రెస్ ఎద్దేవా
‘‘విదేశీ పర్యటనలు చేసి, అవార్డులు అందుకుని స్వదేశానికి తిరిగివస్తున్న ప్రధానమంత్రికి ఆర్‌ఎ్‌సఎస్ అందించిన స్వాగతం చూడండి’’ అని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ శుక్రవారం ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ‘అయ్యో.. ప్రధాని’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తాను చేసే ప్రబోధాలకు బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ కట్టుబడి ఉండాలని మరో కాంగ్రెస్ నేత అభిషేక్ మనూ సింఘ్వీ సూచించారు. వచ్చే సెప్టెంబరుతో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న మోదీ, భాగవత్ ఇద్దరూ.. బ్యాగులు సర్దుకుని కార్యాలయాలను వదిలిపెట్టాలని ఏఐసీసీ నేత పవన్ ఖేడా కోరారు.
మోదీకి ఆ సూత్రం వర్తించదు: ఆర్‌ఎ్‌సఎస్ పరిశీలకులు
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 75 సంవత్సరాలు అనే నిబంధన వర్తించబోదని ఆర్‌ఎ్‌సఎస్ మాజీ నేత, సంఘ్ పరిశీలకుడు దిలీప్ దేవధర్ తెలిపారు. నరేంద్రమోదీ ఈ నిబంధనకు మినహాయింపు అని, బీజేపీలోని మార్గదర్శక మండలి సభ్యులకు మాత్రమే 75 ఏళ్లు అనే నిబంధన వర్తిస్తుందని ఐదేళ్ల క్రితమే మోహన్ భాగవత్ వివరణ ఇచ్చారని దిలీప్ గుర్తుచేశారు. అలాగే, వయసు ప్రమాణంగా ఆర్‌ఎ్‌సఎస్ అధినేత వైదొలగడం అనేది ఆ సంస్థ చరిత్రలోనే లేదని సంఘ్ పరిశీలకులు చెబుతున్నారు. ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్‌లుగా గతంలో పనిచేసిన రజ్జూ భయ్యా, కేఎస్ సుదర్శన్ అనారోగ్యకారణాలతో 78వ యేట బాధ్యతల నుంచి తప్పుకున్నారని, బాలాసాహెచ్ దియోరస్ 79 ఏళ్లవరకు ఆపదవిలో ఉన్నారని గుర్తుచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
For Telangana News And Telugu News