Chandigarh court verdict: లంచం కేసులో రిటైర్డు హైకోర్టు జడ్జి నిర్మల్ యాదవ్ నిర్దోషి
ABN , Publish Date - Mar 30 , 2025 | 04:47 AM
పంజాబ్-హరియాణా హైకోర్టు రిటైర్డు జడ్జి నిర్మల్ యాదవ్‌ను 17 ఏళ్ల నాటి లంచం కేసులో నిర్దోషిగా విడుదల చేసింది. సీబీఐ కోర్టు ఆధారాలు లేని కారణంగా కేసును కొట్టివేసింది.

ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు
17 ఏళ్ల నాటి కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు
చండీగఢ్, మార్చి 29: ఆస్తి వివాదంలో లంచం తీసుకోవడానికి ప్రయత్నించారన్న కేసులో పంజాబ్-హరియాణా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ యాదవ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ శనివారం ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ‘జడ్జి ఇంటి గుమ్మం వద్ద నగదు’ పేరుతో 17 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన కేసులో ఆమె బయటపడ్డారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జిపై కేసు నమోదు కావడం అదే తొలిసారి. 2008లో రూ.15 లక్షల నగదు ప్యాకెట్‌ను కొందరు ఆమెకు పంపారని, కానీ పొరపాటున అది అప్పటి మరో సిట్టింగ్ జడ్జి అయిన జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్ నివాసానికి చేరిందంటూ కేసు నమోదైంది. ఆ నగదు లబ్ధిదారు జస్టిస్ నిర్మల్ యాదవే అన్న కోణంలో విచారణ జరిగింది. అయితే ఇందుకు తగిన ఆధారాలు లేవంటూ సీబీఐ కోర్టు జడ్జి అల్కా మాలిక్ కేసును కొట్టివేశారు. ఆమెతో పాటు నిందితులుగా ఉన్న మరో నలుగురు వ్యక్తులు- హరియాణా మాజీ అదనపు ఏజీ సంజీవ్ బన్సల్, ఢిల్లీకి చెందిన హోటల్ యజమాని రవీందర్ బాసిన్, చండీగఢ్‌కు చెందిన స్థిరాస్తి సంస్థ డీలర్ రాజీవ్ గుప్తా, నిర్మల్ సింగ్‌లను కూడా నిర్దోషులుగా ప్రకటించారు. సంజీవ్ బన్సల్ 2017 ఫిబ్రవరిలో మరణించడం గమనార్హం. తీర్పుపై నిర్మల్ యాదవ్ స్పందిస్తూ ‘‘న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. నేను ఏ నేరమూ చేయలేదు’’ అని అన్నారు.
ఏం జరిగింది?
2008 ఆగస్టు 13వ తేదీ సాయంత్రం 8.30 గంటల సమయంలో పంజాబ్-హరియాణా హైకోర్టు జడ్జి జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్ నివాసం వద్దకు పర్కాశ్‌రామ్ అనే వ్యక్తి వచ్చి అక్కడి ప్యూన్ అమ్రిక్ సింగ్‌కు ఒక ప్లాస్టిక్ సంచి ఇచ్చాడు. ఆ సంచిలో నోట్ల కట్టలు కనిపించడంతో జస్టిస్ నిర్మల్‌జిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పర్కాశ్ రామ్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. ఆగస్టు 26న ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కూడా అంతర్గతంగా విచారణ జరిపింది. సీబీఐతో పాటు, సుప్రీంకోర్టు అంతర్గత కమిటీలు జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్‌కు క్లీన్‌చిట్ ఇచ్చాయి. 2009 డిసెంబరులో సీబీఐ కేసును మూసివేసింది. అయితే, దాన్ని అంగీకరించని సీబీఐ ప్రత్యేక కోర్టు మళ్లీ దర్యాప్తు చేయాలని 2010 మార్చిలో ఆదేశించింది. 2011 ఏప్రిల్ 18న సీబీఐ కోర్టులో ఛార్జిషీటు సమర్పించింది. ఆ నగదు ప్యాకెట్ జస్టిస్ నిర్మల్ యాదవ్ ఇంటికి తీసుకెళ్లాల్సి ఉండగా, పేర్లు ఒకే మాదిరిగా ఉండడంతో జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్ ఇంటి వద్దకు వచ్చిందని సీబీఐ ఆ ఛార్జిషీటులో ఆరోపించింది. తాజాగా కోర్టు అందుకు ఆధారాల్లేవని కేసును కొట్టేసింది.
ఇవి కూడా చదవండి:
AC Safety Tips: అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి..పేలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Railway Jobs: రైల్వేలో 9,970 పోస్టులకు నోటిఫికేషన్..అప్లై చేశారా లేదా..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్