Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ విజయ రహస్యం ఇదే
ABN , Publish Date - Jul 27 , 2025 | 08:14 PM
ఆధునిక యుద్ధాల్లో ఒక దేశం గెలుపు, ఓటమిలను లాజిస్టిక్స్ నిర్వహణే నిర్ణయిస్తుందని రాజ్‌నాథ్ అన్నారు. అయితే లాజిస్టిక్స్ అంటే కేవలం వస్తువులు సరఫరా చేయడం కాదని, వ్యూహాత్మకంగా కీలక రంగమని అన్నారు.

వడోదర: ఆధునిక యుద్ధాలు (Modern wars) తుపాకులు, బుల్లెట్లతో గెలవలేమని, వివిధ ఏజెన్సీల లాజిస్టిక్స్ నిర్వహణే 'ఆపరేషన్ సిందూర్' విజయానికి కారణమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. గుజరాత్‌లోని వడోదరలో గతి శక్తి విశ్వవిద్యాలయం తృతీయ స్నాతకోత్సవంలో ఆదివారంనాడు ఆయన వర్చువల్ ప్రసంగం చేశారు.
ఆధునిక యుద్ధాల్లో ఒక దేశం గెలుపు, ఓటమిలను లాజిస్టిక్స్ నిర్వహణే నిర్ణయిస్తుందని రాజ్‌నాథ్ అన్నారు. అయితే లాజిస్టిక్స్ అంటే కేవలం వస్తువులు సరఫరా చేయడం కాదని, వ్యూహాత్మకంగా కీలక రంగమని అన్నారు. 'ప్రపంచం ఎంత వేగంగా మారుతోందో చూస్తే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. రక్షణ రంగంలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నారు. యుద్ధ రీతుల్లో కీలక మార్పులు వస్తున్నాయి. ఇవాళ్టి శకంలో కేవలం తుపాకులు, బుల్లెట్లతో యుద్ధాలు గెలవలేం. వాటిని సకాలంలో డెలివరీ చేయడం వల్లే గెలుపు సాధ్యం' అని రాజ్‌నాథ్ వివరించారు.
ఆధునిక యుద్ధంలో లాజిస్జిక్స్ లేకపోతే అది కన్ఫ్యూజన్ జోన్ అవుతుందని రాజ్‌నాథ్ అన్నారు. పటిష్టమైన లాజిస్టిక్స్‌తోనే దేశ సరిహద్దులు పటిష్టంగా ఉంటాయని చెప్పారు. యుద్ధం కావచ్చు, జాతీయ విపత్తు కావచ్చు, మహమ్మారులు కావచ్చు.. లాజిస్టిక్ సపోర్ట్ చైన్ నిలకడగా, సురక్షితంగా, సమర్ధవంతంగా ఉండటం ఏ దేశానికైనా కీలకమని చెప్పారు. ఆర్మీ పరంగా చూస్తే లాజిస్టిక్ అంటే ఆయుధాలు, ఇంధనం, రేషన్, మెడిసన్లు సకాలంలో డెలివరీ చేయడమని, నేవీ పరంగా చూస్తే, విడిభాగాలు, ఇతర సామాగ్రిని నౌకల్లో సకాలంలో అందుబాటులో ఉండేలా చూడటమని అన్నారు. వాయిసేన అయితే గ్రౌండ్ సపోర్ట్, నిరంతరాయ ఇంధన సరఫరా సహకారంతో ఎలాంటి అవరోధాలు లేకుండా తమ జెట్లను నడపడమని అన్నారు. మనకు అడ్వాన్స్‌డ్ క్షిపణి వ్యవస్థలు ఉండి కూడా సకాలంలో అవసరమైన ఎలక్ట్రానిక్స్ చేరకపోతే టెక్నాలజీ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రాజ్‌నాథ్ అన్నారు. లాజిస్టిక్స్ ఇంటిగ్రేషన్ ఐడియా కొనసాగింపులో భాగంగానే పీఎం గతి శక్తి పథకాన్ని కేంద్రం తెచ్చిందని వివరించారు.
ఇవి కూడా చదవండి..
మోదీతో ఏం జరిగిందో ఆయనే చెప్పాలి.. ధన్‌ఖడ్ రాజీనామాపై ఖర్గే
మాకు అంతా ఇక మంచే... మాతోశ్రీకి రాజ్ రాకపై ఉద్ధవ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి