Share News

Rajasthan Woman: ఈ మహిళ తెలివి మామూలుగా లేదు.. టెక్నాలజీతో దోచేసింది..

ABN , Publish Date - May 24 , 2025 | 09:38 PM

Rajasthan Woman: వాటిలోంచి ఆమె రెండు ఉంగరాలు, మంగళసూత్రాన్ని సెలక్ట్ చేసుకుంది. వాటి బరువు 15.2 గ్రాములు ఉంది. మార్కెట్ రేటు ప్రకారం వాటి ధర 1,54,500 రూపాయలు అయింది.

Rajasthan Woman: ఈ మహిళ తెలివి మామూలుగా లేదు.. టెక్నాలజీతో దోచేసింది..
Rajasthan Woman,

టెక్నాలజీకి పెద్ద పీట వేస్తూ దేశం మొత్తం ముందుకు దూసుకుపోతోంది. ఆన్‌లైన్ లావాదేవీలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న బడ్డీకొట్టు దగ్గరినుంచి కోట్ల రూపాయలు సంపాదించే పెద్ద పెద్ద బిజినెస్ల వరకు అన్నీ యూపీఐ పేమెంట్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. రూపాయికి కూడా యూపీఐ చేసే జనాలు లేకపోలేదు. అయితే, టెక్నాలజీని ఉపయోగించి కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ యూపీఐ లావాదేవీలు సైతం సృష్టిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ ఫేక్ పేమెంట్ స్క్రీన్ షాట్‌తో నగల షాపుకు కన్నం వేసింది.


ఏకంగా లక్ష రూపాయలకు పైగా సొత్తు కాజేసింది. ఆ వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని అల్వార్‌కు చెందిన ఓ మహిళ గత మంగళవారం నగలు కొనడానికి బంగారం షాపుకు వెళ్లింది. అల్వార్‌లోని ఎస్కే జ్యువెలర్స్ షాపులోకి వెళ్లి.. తనకు బంగారు ఉంగరాలు, మంగళ సూత్రం కావాలని అడిగింది. తాము బంగారు ఆభరణాలు తయారు చేసే వాళ్లమని, అమ్మటం కుదరదని వాళ్లు చెప్పారు. అయినా ఆమె అక్కడినుంచి వెళ్లలేదు. వాళ్లను బ్రతిమాలింది. ఆమె అంతగా బతిమాలుతుండటంతో కాదనలేకపోయారు.


వేరే వ్యక్తుల కోసం తయారు చేసిన బంగారు ఆభరణాలను ఆమెకు చూపించారు. వాటిలోంచి ఆమె రెండు ఉంగరాలు, మంగళసూత్రాన్ని సెలక్ట్ చేసుకుంది. వాటి బరువు 15.2 గ్రాములు ఉంది. మార్కెట్ రేటు ప్రకారం వాటి ధర 1,54,500 రూపాయలు అయింది. ఆమె ఆన్‌లైన్ పేమెంట్ చేస్తానని చెప్పింది. అయితే, షాపు వాళ్లు క్యాష్ కావాలన్నారు. తన దగ్గర క్యాష్ లేదని చెప్పటంతో అకౌంట్ నెంబర్ ఇచ్చారు. మొదట ఆమె తన అకౌంట్ నుంచి 1 రూపాయి వారికి పంపింది.


అది అకౌంట్‌లో చూపించింది. ఇప్పుడు అసలు కథ మొదలైంది. లక్షా యాభై నాలుగు వేలను ఆమె వారి అకౌంట్‌కు పంపలేదు. ఓ ఫేక్ స్క్రీన్ షాట్‌ను క్రియేట్ చేసింది. నెఫ్ట్ ద్వారా తాను డబ్బులు పంపానని, అవి అకౌంట్‌లో చూపించడానికి రెండు గంటల సమయం పడుతుందని వారికి చెప్పింది. వారు ఆమె మాటలు నమ్మారు. నగలు ఆమెకు ఇచ్చి పంపేశారు. అయితే, 24 గంటలు గడిచినా డబ్బులు అకౌంట్‌లో పడలేదు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ కోసం గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Mukul Dev: టాలీవుడ్ విలన్ మృతి.. ఈయన ఎవరి తమ్ముడో తెలుసా..

Viral Video: బస్ రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు.. కండెక్టర్ లేకపోయి ఉంటే..

Updated Date - May 24 , 2025 | 09:46 PM