Political Corruption: బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీ
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:33 AM
బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందని నిరూపించే ఆటంబాంబు వంటి ఆధారం తమ వద్ద

ఆటంబాంబు వంటి ఆధారం ఉంది
పేల్చితే దాక్కోడానికి ఈసీకి చోటుండదు
ఇది విద్రోహ చర్య... బాధ్యులు రిటైరైనా కూడా వదిలిపెట్టబోం: రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తోందని నిరూపించే ఆటంబాంబు వంటి ఆధారం తమ వద్ద ఉన్నదని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వెల్లడించారు. ఆ ఆటంబాంబును పేల్చితే ఈసీకి దేశంలో దాక్కోవడానికి చోటు కూడా మిగలదని వ్యాఖ్యానించారు. ఈసీ చర్య విద్రోహం కిందకే వస్తుందని, ఇందులో భాగస్వాములైన ఉన్నతాధికారుల నుంచి కింది సిబ్బంది వరకు ఎవరినీ వదిలిపెట్టబోమని, ఒకవేళ రిటైరు అయి ఎక్కడెక్కడో ఉన్నా వెతికిమరీ పట్టుకుంటామని రాహుల్ హెచ్చరించారు. బిహార్‌లో ఎస్‌ఐఆర్ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ శుక్రవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ ఈసీపై విమర్శలు గుప్పించారు. నిజానికి, ఈ నెల ఐదో తేదీన కర్ణాటకలో ఈసీ అక్రమాలను బయటపెడతామని గురువారమే కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. దీనిపై రాహుల్‌గాంధీ నాయకత్వంలో బెంగళూరులో భారీ నిరసన ప్రదర్శన కూడా ఉంటుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ చేసిన ‘ఆటంబాంబు’ వ్యాఖ్య ఆసక్తిని రేపుతోంది. ‘‘ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని ముందునుంచీ నేను చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు దానికి సంబంధించిన ఆధారం కూడా మాకు లభించింది’’ అని పార్లమెంటు ఆవరణలో రాహుల్ అన్నారు. 2023లో మధ్యప్రదేశ్ ఎన్నికలు, ఆ మరుసటి ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ ఉల్లంఘనలు జరిగాయన్నారు. ‘‘మహారాష్ట్రలో ఓటర్ల సవరణ పేరిట కోటిమందిని కొత్తగా ఎన్నికల జాబితాలో చేర్చారని మేం ఇప్పటికీ నమ్ముతున్నాం. ఆధారాలతో ఈసీని కలిసినా అప్పట్లో ఉపయోగం లేకపోయింది. దీంతో మేమే రంగంలోకి దిగాం. సొంతంగా ఆరునెలలపాటు దర్యాప్తు జరిపి.. ఈసీకి వ్యతిరేకంగా ‘ఆటంబాంబు’ వంటి ఆధారం కనుగొన్నాం.’’ అని రాహుల్‌గాంధీ వివరించారు. మరోవైపు, ‘ఓట్లచోరీ’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఈసీ తోసిపుచ్చింది. అలాంటి నిరాధార ఆరోపణలను పట్టించుకోనక్కర్లేదని తన సిబ్బందికి స్పష్టంచేసింది. ‘‘ఈసీపై నిరాధార ఆరోపణలు చేయడం, బెదిరింపులకు పాల్పడటం రోజువారీ వ్యవహారంగా మారింది. బాధ్యత లేని ఇలాంటి ప్రకటనలను పట్టించుకోకుండా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని మా సిబ్బందిని కోరాం.’’ అని వివరించింది. తమ వద్ద ‘ఆటంబాంబు’ లాంటి ఆధారం ఉన్నదన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘ఆటంబాంబాలా పేలొద్దు. నీరులా ప్రవహించండి’ అంటూ ఎద్దేవాచేసింది. మర్యాద లేకుండా ఈసీపై అప్రజాస్వామిక భాషను రాహుల్ వాడటం సరికాదని సంబిత్ పాత్రా మండిపడ్డారు.
బిహార్‌లో 65 లక్షల ఓట్లు ‘మిస్సింగ్’
బిహార్‌లో ఎస్‌ఐఆర్ కసరత్తు పూర్తయిన నేపథ్యంలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది ఇందులో చేర్చలేదని స్పష్టమైంది. ఎస్‌ఐఆర్‌కు ముందు రాష్ట్రంలో 7.9 కోట్ల ఓట్లు ఉండగా, తాజాగా ఆ సంఖ్య 7.24 కోట్లకు తగ్గింది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 90,817 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల జాబితాను ఈసీ క్షుణ్ణంగా పరిశీలించింది. మృతిచెందిన, వలస వెళ్లిన, ఒకసారి కంటే ఎక్కుసార్లు రిజస్టర్ అయిన, చిరునామాలేని ఓటర్లను జాబితా నుంచి తొలగించింది. రాజధాని పాట్నాలో అత్యధికంగా 3.95 లక్షల మంది చోటు కోల్పోయారు.