General Rahul R Singh: భారత్‌కు ఒక సరిహద్దు.. ముగ్గురు శత్రువులు
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:12 AM
పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఒక్క సరిహద్దు ఆవల ముగ్గురు శత్రువులతో భారత్ పోరాడిందని ఆర్మీ డిప్యూటీ చీఫ్ (క్యాపబిలిటీ డెవల్‌పమెంట్) లెఫ్టినెంట్ జనరల్ రాహుల్.ఆర్.సింగ్ అన్నారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా, తుర్కియే మద్దతు
చైనా ఆయుధాల పరీక్షకు పాక్ ‘లైవ్‌ల్యాబ్’
81ు పాక్ సైనిక హార్డ్‌వేర్ చైనాదే వెల్లడించిన ఆర్మీ అధికారి రాహుల్ సింగ్
న్యూఢిల్లీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఒక్క సరిహద్దు ఆవల ముగ్గురు శత్రువులతో భారత్ పోరాడిందని ఆర్మీ డిప్యూటీ చీఫ్ (క్యాపబిలిటీ డెవల్‌పమెంట్) లెఫ్టినెంట్ జనరల్ రాహుల్.ఆర్.సింగ్ అన్నారు. యుద్ధంలో పాకిస్థాన్ నేరుగా పాల్గొన్నా.. ఆ దేశానికి ఆయుధాలిచ్చి చైనా, తుర్కియేలు భాగస్వాములైనట్లు ఆయన తెలిపారు. 2015 నుంచి పాకిస్థాన్‌కు చైనాయే ఆయుధాలను, యుద్ధ సామగ్రిని సరఫరా చేస్తోందని గుర్తుచేశారు. పాకిస్థాన్ సైనిక హార్డ్‌వేర్‌లో 81ు చైనా అందజేసినదేనని చెప్పారు. చైనా తన సైనిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్ష యుద్ధ పరిస్థితుల్లో పరీక్షించేందుకు పాకిస్థాన్‌ను లైవ్ ల్యాబ్‌లా వాడుకుంటోందని వివరించారు.
శుక్రవారం ఢిల్లీలో జరిగిన భారత, వాణిజ్య పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఆపరేషన్ సిందూర్ నుంచి తాము ఎంతో నేర్చుకున్నామని జనరల్ రాహుల్ సింగ్ పేర్కొన్నారు. ‘‘తొలుత 21 టార్గెట్లు అనుకున్నాం. కానీ, చివరి క్షణాల్లో టార్గెట్లను 9కి తగ్గించాం’’ అని ఆయన వివరించారు. చైనా-పాకిస్థాన్ సంబంధాలు కేవలం ఆయుధాల సరఫరాకే పరిమితం కాలేదని.. చైనా తన ఆధునిక సాంకేతికత, యుద్ధ తంత్రాలను పాకిస్థాన్‌కు అందజేస్తోందని జనరల్ రాహుల్ పేర్కొన్నారు. పాకిస్థాన్ గడ్డ మీద నుంచి నిఘా వ్యవస్థలు, డ్రోన్లను చైనా ప్రత్యక్షంగా ప్రయోగిస్తోందని వివరించారు.