Share News

Amul vs Nandini: డెయిరీ బ్రాండ్లపై మళ్లీ కర్ణాటకలో రాజకీయ వేడి

ABN , Publish Date - Jun 18 , 2025 | 08:33 PM

బెంగళూరులోని 10 మెట్రో స్టేషన్లలో గుజరాత్‌కు చెందిన డెయిరీ బ్రాండ్ 'అమూల్' దుకాణాలు తెరుచుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతించడంతో వివాదం తలెత్తింది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

Amul vs Nandini: డెయిరీ బ్రాండ్లపై మళ్లీ కర్ణాటకలో రాజకీయ వేడి

బెంగళూరు: కర్ణాటకలో మళ్లీ డెయిరీ బ్రాండ్లపై రాజకీయ వేడి మొదలైంది. బెంగళూరులోని 10 మెట్రో స్టేషన్లలో గుజరాత్‌కు చెందిన డెయిరీ బ్రాండ్ 'అమూల్' (Amul) దుకాణాలు తెరిచేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతించడంతో వివాదం తలెత్తింది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అమూల్ బ్రాండ్‌ను ప్రభుత్వం అనుమతించడం ద్వారా రాష్ట్ర బ్రాండ్ అయిన 'నందిని' (Nandini) మిల్క్‌ను ప్రమోట్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విపక్ష బీజేపీ, జేడీఎస్ తప్పుపట్టాయి.


మెట్రో స్టేషన్లలో దుకాణాలు పెట్టుకునేందుకు అమూల్‌కు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనుమతి ఇచ్చింది. ఇందుకోసం టెండర్లు కూడా పిలిచింది. దీంతో అమూల్‌కు బదులు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని నందిని బ్రాండ్‌కు అనుమతి ఇచ్చి ఉండాల్సిందని విపక్షాలు ఆక్షేపణ తెలిపాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌కు భాగస్వామిగా ఉన్న జనతాదళ్ (సెక్యులర్) దీనిపై సోషల్ మీడియాలో కాంగ్రెస్‌ను, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను టార్గెట్ చేసింది. 'సేవ్ నందిని' అంటూ హ్యాష్‌టాగ్‌తో ఆ పార్టీ పోస్ట్ చేసింది. డీకే శివకుమార్ కమీషన్ల కోసం ఆత్మగౌరవాన్ని అమ్మకానికి పెట్టారంటూ ఆరోపించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు నందిని బ్రాండ్‌ను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుని, అనూహ్యంగా బీజేపీపై పెద్ద విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేసింది.


'ఎన్నికలకు ముందు కన్నడిగుల ఆత్మగౌరవాన్ని పెంచుతామని డీకే మాట్లాడారు. ఇప్పుడు కమీషన్ల కోసం ఇక్కడి పాల ఉత్పత్తులకు తిలోదకాలిచ్చి ఇతర రాష్ట్రాలకు అనుమతిస్తున్నారు. 10కి పైగా మెట్రో స్టేషన్లలో బయట రాష్ట్రాల ఉత్పత్తుల అమ్మకాలను అనుమతిస్తున్నారు. సొంత పార్టీ ప్రమోషన్ కోసం నందిని బ్రాండ్, మన రైతులు, కన్నడికుల ఆత్మగౌరవాన్ని ఉపయోగించుకున్న కాంగ్రెస్ ఎన్నికల తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయింది' అనే జేడీఎస్ ఆ ట్వీట్‌లో విరుచుకుపడింది.


బీజేపీ సైతం ఇదే తరహాలో కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడింది. బీజేపీ బయట వ్యక్తులను ఎంకరేజ్ చేస్తోందంటూ ఎన్నికలకు ముందు తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు బయటవ్యక్తులకు పట్టం కడుతోందని బీజేపీ నేత పీసీ నేత మరో ట్వీట్‌లో విమర్శించారు. నందిని స్థానంలో 10 మెట్రో స్టేషనన్లలో అమూల్ స్టోర్స్‌కు అనుమంతిచడం కంటే హిపోక్రసీ ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.


డీకే ఏమన్నారంటే..?

కాగా, విపక్ష పార్టీల విమర్శలను డీకే శివకుమార్ తోసిపుచ్చారు. అమూల్ ఒక్కటే దరఖాస్తు చేసుకుందని ఆయన చెప్పారు. అమూల్‌కు అనుమతి ఇచ్చిన 10 మెట్రో స్టేషన్లలో 8 మెట్రోస్టేషన్లలో నందిని ఔట్‌లెట్స్‌ను కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోనుందని చెప్పారు. అమూల్ రెండు చోట్ల ఔట్‌లెట్స్ తెరిచిందని, దీని అర్ధం ప్రస్తుతం ఉన్న స్టోర్స్‌ను మూసివేస్తున్నట్టు కాదని అన్నారు. బీఎంఆర్‌సీఎల్‌కు దరఖాస్తు చేసుకోవాలని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు తాము ఆదేశాలిచ్చినట్టు చెప్పారు.


ఇవి కూడా చదవండి..

కబుర్ల దేవత పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం

కేరళ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఎఫ్-35బి

For More National News

Updated Date - Jun 18 , 2025 | 08:39 PM