Share News

PM Modi-Elon Musk: ఎలాన్ మస్క్‌తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Apr 18 , 2025 | 03:32 PM

టెక్నాలజీలో అమెరికాతో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇందులో భాగంగా ఇవాళ ఎలాన్ మస్క్‌తో కొనసాగింపు చర్చలు జరిపారు.

PM Modi-Elon Musk: ఎలాన్ మస్క్‌తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ
PM Modi Discusses With Elon Musk

PM Modi Discusses With Elon Musk: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ(శుక్రవారం) టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో మాట్లాడారు. టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాలలో సహకారం గురించి చర్చించారు. దీనికి సంబంధించి పీఎం మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. "ఈ ఏడాది ఆరంభంలో వాషింగ్టన్ డిసిలో జరిగిన మా సమావేశంలో చర్చించిన అంశాలతో సహా వివిధ సమస్యలు, అంశాల గురించి ఎలాన్ మస్క్‌తో మాట్లాడాను. టెక్నాలజీ, ఇన్నోవేషన్స్ రంగాలలో సహకారానికి ఉన్న అపారమైన అవకాశాలపై మేము చర్చించాం" అని మస్క్ యాజమాన్యంలోనే ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పీఎం మోదీ పోస్ట్‌ చేశారు. టెక్నాలజీలో అమెరికాతో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని మోడీ అన్నారు.

కాగా, 2030 నాటికి $500 బిలియన్ల వాణిజ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో భారత్ - అమెరికా ప్రతిష్టాత్మక ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రముఖ సలహాదారన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా, వాషింగ్టన్‌లో టెస్లా చీఫ్‌ను కలుసుకుని ఇండియాలో టెస్లా స్థాపనకు సంబంధించిన అంశాలతోపాటు సాంకేతికత, నూతన ఆవిష్కరణలకు సంబంధించి వివిధ అంశాలపై చర్చించారు.

ఇలా ఉండగా, ప్రపంచంలోనే ప్రముఖ EV(Electric Vehicle) తయారీదారైన టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడానికి రంగం చకచకా సిద్ధమవుతోంది, భారత దిగుమతి విధానాల కారణంగా చాలా కాలంగా మస్క్‌ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటో మార్కెట్ అయిన భారత్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు ఆ కల సాకారం కాబోతోంది. దీంతో పాటు మరిన్ని రంగాల్లో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మస్క్ గ్రూప్ కంపెనీలు సన్నద్ధమవుతుండం భారత్‌కు అనుకూలించే అంశం. ఎలాన్ మస్క్‌కు చెందిన మరో కంపెనీ అయిన స్టార్‌లింక్, ఇటీవల భారత టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో కలిసి ఇండియాలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల్ని అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.

అంతేకాకుండా, అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్, అతని భార్య ఉష వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా కొత్త ట్రేడ్ టారిఫ్‌ అంశంపై కూడా వాన్స్ భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు. ఈ నెల ప్రారంభంలో ట్రంప్ ప్రభుత్వం భారతీయ వస్తువులపై 26% దిగుమతి సుంకాన్ని విధించింది, తర్వాత వాటి అమలును 90 రోజులు నిలిపివేసిన సంగతి తెలిసిందే.

వాణిజ్య ఒప్పందం కింద భారత్ - అమెరికాలు రాబోయే వారాల్లోనే రంగాలవారీ చర్చలు జరపనున్నాయి. ఇవి ట్రంప్ సడలించిన 90 రోజుల వ్యవధిలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఒప్పందాల యొక్క నిబంధనలు ఇప్పటికే ఖరారు అయినట్టు తెలుస్తోంది. మరిన్ని చర్చలు ప్రధానంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా భారత్ - అమెరికాల మధ్య జరగనున్నాయి. అటు, భారత బృందం కూడా త్వరలోనే అమెరికాను సందర్శించే అవకాశం కనిపిస్తోంది.

అయితే, ట్రేడ్ టారిఫ్స్ ఒప్పందాల్లో ఇరు దేశాల మధ్య జీరో ట్యాక్స్ విధానం అమలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అటువంటి ప్రణాళిక, సాధారణంగా మరింత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ - అమెరికా వంటి ఆర్థిక వ్యవస్థలు దీనికి సరిపడతాయికాని, కానీ అది అభివృద్ధి చెందుతోన్న భారతదేశం, అభివృద్ధి చెందిన అమెరికా మధ్య జరగే అవకాశాలు చాలా తక్కువ.


Read Also: మనిషి కాదు మృగం.. 11 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా..

EPS: తేల్చేశారు.. ఆ పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వబోం..

BJP: ‘కాబోయే ముఖ్యమంత్రి నయినార్‌ నాగ్రేందన్‌’

Updated Date - Apr 18 , 2025 | 03:47 PM