Tempo Traveller Rams Stationary: ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి..
ABN , Publish Date - Nov 02 , 2025 | 09:15 PM
ఫలోడి జిల్లాలోని మటోడా ఏరియాలో ఊహించని దారుణం చోటుచేసుకుంది. టెంపో కారు రోడ్డు పక్క ఆగి ఉన్న ఓ వాహనాన్ని ఢీ కొట్టింది. ఢీకొట్టిన వేగానికి టెంపో నుజ్జునుజ్జయింది.
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు రోడ్డు పక్క ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. జోద్‌పూర్, సుర్ సాగర్ ప్రాంతానికి చెందిన 22 మంది బికనేర్‌లోని కోలాయత్ గుడికి వెళ్లారు. దర్శనం చేసుకుని ఆదివారం టెంపో కారులో ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఫలోడి జిల్లాలోని మటోడా ఏరియాలో ఊహించని దారుణం చోటుచేసుకుంది. టెంపో కారు రోడ్డు పక్క ఆగి ఉన్న ఓ వాహనాన్ని ఢీ కొట్టింది. ఢీకొట్టిన వేగానికి టెంపో నుజ్జునుజ్జయింది. టెంపోలో ప్రయాణిస్తున్న 18 మంది భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెను వెంటనే రంగంలోకి దిగారు. సహాయక చర్యలు మొదలు పెట్టారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక, ఈ సంఘటనపై ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
బిగ్ అలర్ట్.. ఏపీలో రానున్న మూడు గంటల్లో వర్షాలు