Karnataka CM Siddaramaiah: కాంగ్రెస్ సీఎంకు పాకిస్థాన్ రత్న బిరుదు..
ABN , Publish Date - Apr 27 , 2025 | 05:34 PM
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను స్వపక్ష కాంగ్రెస్ నేతలు, విపక్ష బీజేపీ నేతలని తేడా లేకుండా కుంకుడు కాయల రసంతో తలంటేశారు. నెహ్రూ తర్వాత పాకిస్థాన్ వీధుల్లో ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగించేది నిన్నే అంటూ..

Karnataka CM Siddaramaiah Remarks Effect: "పాకిస్తాన్‌తో యుద్ధానికి అనుకూలంగా లేను" అనే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన ఒక రోజు తర్వాత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లైన్లోకి వచ్చారు. ఈరోజు తన వ్యాఖ్యలకి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. "మనం యుద్ధానికి వెళ్లకూడదని ఎప్పుడూ చెప్పలేదు" అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎం అయిన సిద్ధ రామయ్య వ్యాఖ్యలకు బిజెపి నుండే కాక, స్వంత పార్టీ(కాంగ్రెస్) నేతల నుంచీ తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో సిద్ధరామయ్య తన మాటలకు మినహాయింపులివ్వాల్సి వచ్చింది.
"పాకిస్తాన్‌తో యుద్ధానికి వెళ్లకూడదని నేను ఎప్పుడూ చెప్పలేదు, యుద్ధం పరిష్కారం కాదని నేను చెప్పాను. పర్యాటకులకు రక్షణ ఇవ్వాలి. ఇది ఎవరి బాధ్యత? వైఫల్యం జరిగిందని నేను చెప్పాను" అని ఈ కాంగ్రెస్ నాయకుడు అన్నారు. "ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. భారత ప్రభుత్వం తగినంత భద్రత కల్పించలేదు. యుద్ధం విషయానికొస్తే, అది అనివార్యమైతే, మనం యుద్ధానికి వెళ్లాలి" అని ఆయన తాజాగా అన్నారు.
పహల్గాంలో 26 మందిని మీరు హిందువులా అని అడిగిమరీ.. అమాయకుల నుదుటన ఏకే 47 గన్ పెట్టి అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఇంత దారుణానికి ఒడిగట్టినందుకు యావత్ ప్రపంచం భారత్ కు సంఘీభావంగా నిలుస్తోంది. ఇంత దురాగతం చేసినా కూడా, పాకిస్థాన్ లోని మతచాంధస వాదులు మాత్రం 'మీ ఊపిరాపేస్తాం'.. 'సింధు నదిలో మీ రక్తం పారుతుందంటూ' కారుకూతలు కూస్తుంటే, సీఎం సిద్ధరామయ్య సూక్తిముక్తావళి అందరికీ విస్మయాన్ని, కంపరాన్ని పుట్టించింది.
దీంతో బీజేపీ పార్టీ నాయకులైతే సిద్ధరామయ్యను "పాకిస్తాన్ రత్న" అని అభివర్ణిస్తున్నారు. సిద్ధరామయ్య చేసిన 'యుద్ధం వద్దు' వ్యాఖ్యల్ని పాకిస్తాన్ మీడియా పతాక శీర్షికన ప్రచురించి భారీ కవరేజ్ ని ఇచ్చిన విషయాన్ని.. సదరు నివేదికల్ని ఎత్తి చూపుతున్నారు. ప్రముఖ వార్తా ఛానల్ జియో న్యూస్ సహా పాకిస్తాన్ మీడియా కర్ణాటక ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బాగా కవర్ చేసింది. వాటిని "భారతదేశం నుండి యుద్ధానికి వ్యతిరేకంగా స్వరాలు" అని అభివర్ణిస్తూ పతాక శీర్షికన ప్రచురించాయి.
దీంతో.. జియో న్యూస్ బులెటిన్ నుండి ఒక క్లిప్‌ను షేర్ చేస్తూ, కర్ణాటక బిజెపి చీఫ్ బి.వై. విజయేంద్ర X(సోషల్ మీడియా మాధ్యమం)లో ఆసక్తికర పోస్ట్ చేశారు. "సరిహద్దుల అవతల నుండి వజర్-ఎ-అలా @siddaramaiah కు పెద్ద చీర్స్! పాకిస్తాన్ మీడియా @siddaramaiah ను ప్రశంసిస్తోంది. పాకిస్తాన్‌తో యుద్ధానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు బిజెపి సహా ఇతర వర్గాల నుండి ఆయనకు వస్తున్న ఎదురుదెబ్బకి మాత్రం కచ్చితంగా నిరాశ చెందింది." అని రాసుకొచ్చారు.
అంతేకాదు, భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూను ప్రస్తావిస్తూ విజయేంద్ర ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్పారు "పాకిస్తాన్‌కు అనుకూలంగా సింధు జల ఒప్పందంపై సంతకం చేసినందుకు నెహ్రూ చాలా సంతోషంగా ఉన్నందున, నెహ్రూను రావల్పిండి వీధుల్లో ఓపెన్ జీపులో తీసుకెళ్లి ఊరేగించారు. పాకిస్తాన్‌లో ఓపెన్ జీపులో తిప్పికొట్టాల్సిన తదుపరి రాజకీయ నాయకుడు సిద్ధరామయ్య అవుతారా?" అని అన్నారు. దీనిపై నెటిజనం వెర్రెక్కిపోయి కామెంట్లు చేస్తున్నారు.
సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి ప్రముఖు నేత బిఎస్ యెడియూరప్ప కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. "మనం ఐక్యంగా నిలబడాల్సిన సమయంలో, సిద్ధరామయ్య ప్రకటనలు చాలా ఖండించదగినవి. అతనివి పిల్లతనం చేష్టలు. ఆయన వాస్తవికతను అర్థం చేసుకోవాలి. దేశం కలిసి నిలబడి ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఇది ముఖ్యమంత్రి పదవికి మంచిది కాదు. నేను దీనిని ఖండిస్తున్నాను. ఆయన దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి తన నడకను సరిదిద్దుకోవాలి" అని ఆయన అన్నారు.
కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక.. సిద్ధరామయ్యను "పాకిస్తాన్ రత్న"గా అభివర్ణించారు. "ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మీ చిన్నపిల్లల మరియు అసంబద్ధమైన ప్రకటనల కారణంగా మీరు రాత్రికి రాత్రే పాకిస్తాన్‌లో ప్రపంచ ప్రసిద్ధి చెందారు" అని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యలను ఆసక్తికరంగా ఆయన తోటి పార్టీ సహచరులు కూడా ఖండించారు. కాంగ్రెస్ నాయకుడు హెచ్.ఆర్. శ్రీనాథ్ మాట్లాడుతూ ఇది "వ్యక్తిగత ప్రకటన" అని, ఇది పార్టీ వైఖరిని సూచించదని అన్నారు. "ఇది సిద్ధరామయ్య చేసిన వ్యక్తిగత ప్రకటన, కాంగ్రెస్ పార్టీది కాదు. నేను చెప్పదలచుకున్నదల్లా మీరు అలాంటి వ్యక్తిగత ప్రకటనలు చేయాలనుకుంటే, మీరు పార్టీకి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ముందుకు సాగవచ్చు. రాహుల్ గాంధీ, ఇతరులు ఐక్యత కోసం విజ్ఞప్తి చేశారు. వారిని అనుసరించే బదులు, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు" అని ఆయన అన్నారు.
ఇక, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. "కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా వైఖరి తీసుకుంది. ముఖ్యమంత్రి చెప్పిన దానిపై నేను వ్యాఖ్యానించదలచుకోలేదు. మీరు దాని గురించి ఆయనను అడగాలి" అని ఆయన అన్నారు.
ఇలా ఉండగా, ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక కాశ్మీరీ పోనీ రైడ్ ఆపరేటర్ మరణించిన సంగతి తెలిసిందే. ఇది కేంద్రంగానే సీఎం సిద్ధరామయ్యకు దారుణంగా సెటైర్లు, విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
లిక్కర్ దందాల కవితకు రాహుల్ పేరెత్తే అర్హత లేదు
పొన్నం చొరవతో స్వస్థలానికి గల్ఫ్ బాధితుడు
జాతీయ మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా డీకే అరుణ
Read Latest Telangana News and National News