Operation Mahadev: పహల్గామ్ ఉగ్రవాదుల హతం.. ఆ రాత్రి అమిత్ షా ఏం చేశారంటే..
ABN , Publish Date - Jul 30 , 2025 | 07:03 PM
Operation Mahadev: అమిత్ షా ఫోన్, వీడియో కాల్స్ ద్వారా సైంటిస్టుల నుంచి అప్‌డేట్స్ తెలుసుకుంటూ ఉన్నారు. ఉదయం 5 గంటల కంతా అసలు విషయం బయటపడింది.

పహల్గామ్, బైసరన్ లోయలో అమాయకులైన పర్యాటకులను కాల్చి చంపిన టెర్రరిస్టులు కుక్క చావు చచ్చారు. హిర్వాన్-లిద్వాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు వారిని కాల్చి చంపాయి. ఆపరేషన్ మహదేవ్ సూపర్ సక్సెస్ అయింది. ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా చచ్చిపోయారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డ ముగ్గురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ గురించి పార్లమెంట్‌లో అధికారిక ప్రకటన ఇవ్వడానికి ముందు చాలా పెద్ద తతంగమే జరిగింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఉగ్రవాదుల్ని చంపిన తర్వాత ఆ సమాచారం హోం శాఖ మంత్రి అమిత్ షాకు వెళ్లింది. దీని గురించి పార్లమెంట్‌లో అనౌన్స్‌మెంట్ చేయడానికి ముందు .. చనిపోయింది ఆ ముగ్గురేనా కాదా? అని ఆయన ధ్రువీకరించుకోవాలనుకున్నారు. ఆ రాత్రి సైనిక అధికారులు, సైంటిస్టులతో టచ్‌లో ఉన్నారు. ఎప్పటి కప్పుడు అప్‌డేట్లు తెలుసుకుంటూ ఉన్నారు. ఉగ్రవాదుల్ని చంపిన తర్వాత స్వాధీనం చేసుకున్న వారి గన్నులను, బుల్లెట్ కేసులను అధికారులు పరీక్షల కోసం చండీగఢ్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీకి తరలించారు.
అమిత్ షా ఫోన్, వీడియో కాల్స్ ద్వారా సైంటిస్టుల నుంచి అప్‌డేట్స్ తెలుసుకుంటూ ఉన్నారు. ఉదయం 5 గంటల వరకు అసలు విషయం బయటపడింది. ఆపరేషన్ మహదేవ్‌లో చనిపోయిన ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న గన్నులు, బుల్లెట్ కేసింగ్స్.. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డ ఆ ఉగ్రవాదులు వాడిన గన్నులు, బుల్లెట్ కేసింగ్స్ ఒకటేనని తేల్చారు. ఈ సమాచారంతో అమిత్ షా పార్లమెంట్‌కు వెళ్లారు. ఆయన అక్కడ మాట్లాడుతూ.. ‘అనుమానాలకు ఇక్కడ తావులేదు. నా దగ్గర బాలిస్టిక్ రిపోర్టు ఉంది. నేను వీడియో కాల్ ద్వారా సైంటిస్టులతో మాట్లాడాను. పహల్గామ్ ఉగ్రదాడిలో పేలిన బుల్లెట్లు.. ఆపరేషన్ మహదేవ్‌లో చనిపోయిన ఉగ్రవాదుల గన్నుల నుంచి పేలినవేనని ఆరుగురు సైంటిస్టులు నూటికి నూరు శాతం తేల్చారు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
రోజు రోజుకు పెచ్చు మీరుతున్న దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు..
అదృష్టం అంటే ఈమెదే.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..