Turtle Nesting: ఒడిశా ఏకాకులానాసి దీవిలో ఆలివ్ రిడ్లీ తాబేలు గుడ్లు
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:09 AM
గడిచిన రెండు రోజుల్లో ఈ దీవికి 1.7లక్షల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

33ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
కేంద్రపడ, మార్చి 9: ఒడిశాలోని గహిర్మాత సముద్ర జీవుల పరిరక్షణ కేంద్రం పరిధిలో ఉన్న ఏకాకులానాసి దీవిలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు దాదాపు 33 ఏళ్ల తర్వాత గుడ్లు పెట్టాయి. గడిచిన రెండు రోజుల్లో ఈ దీవికి 1.7లక్షల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రతీ ఏటా ఒడిశా తీరంలో లక్షల సంఖ్యలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు తరలివచ్చి గుడ్లుపెడతాయి. దీన్నే నెస్టింగ్ అంటారు. తర్వాత 40-50రోజులకు పిల్లలు బయటకు వస్తాయి. అయితే, ఏకాకులానాసి దీవి సముద్రపు కోతకు గురవుతున్న నేపథ్యంలో.. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అక్కడికి రావడం లేదు. చివరిసారి 1992లో 3లక్షల తాబేళ్లు ఇక్కడ గుడ్లు పెట్టినట్లు అధికారులు తెలిపారు. కాగా, అంతరించిపోతున్న తాబేలు జాతుల్లో ఆలివ్ రిడ్లీ తాబేలు ఉంది.