Insurance Company: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాలు కోల్పోతే బీమా సొమ్ము ఇవ్వనక్కర్లేదు
ABN , Publish Date - Jul 04 , 2025 | 02:55 AM
అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ప్రాణాలు కోల్పోతే బాధితుడి కుటుంబానికి బీమా పరిహారం రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.....

కంపెనీ చెల్లించాల్సిన పనిలేదు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జూలై 3: అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ప్రాణాలు కోల్పోతే బాధితుడి కుటుంబానికి బీమా పరిహారం రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిహారం చెల్లించాల్సిన అవసరం బీమా కంపెనీకి లేదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం తీర్పు చెప్పింది. 2014 జూన్ 18న ఎన్.ఎ్‌స. రవీషా అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రంలోని మల్లసంద్ర గ్రామం నుంచి అరిసికెరె పట్టణానికి కారు నడుపుతూ ప్రమాదంలో మరణించా రు. ప్రమాదంలో మరణించినందున బీమా కంపెనీ నుంచి రూ.80 లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ ఆ వ్యక్తి తల్లిదండ్రులు, భార్య, కుమారుడు తొలుత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
కారును సొంతంగా, అతివేగంగా నడుపుతూ ప్రమాదానికి గురయినందున పరిహారం ఇవ్వాల్సిన పనిలేదని హైకోర్టు తీర్పు చెప్పింది. ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఈ తీర్పుపై ఆ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది.