యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ లేదు: కేంద్రం
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:34 AM
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారన్న వార్తలు తప్పుడువని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ప్రభుత్వ దృష్టిలో లేదని ఆర్థిక శాఖ పేర్కొంది

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రూ.2 వేలు పైబడిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ వేయాలని కేంద్రం యోచిస్తోందంటూ కొన్ని వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. అవన్నీ పూర్తిగా తప్పుదోవ పట్టించే, నిరాధార, తప్పుడు వార్తలని తెలిపింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేసింది. యూపీఐ లావాదేవీలపై ప్రస్తుతం ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) రుసుములు వసూలు చేయడం లేదని, అలాగే ఆయా లావాదేవీలపై జీఎస్టీ కూడా విధించడం లేదని వెల్లడించింది.