Nimisha Priya Case: మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..
ABN , Publish Date - Jul 15 , 2025 | 07:20 AM
Nimisha Priya Case: ప్రస్తుతం నిమిష ప్రియ కుటుంబం తరపున శామ్యుయెల్ జెరోమ్, షేక్ హబీబ్ హుమర్‌లు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. 10 లక్షల డాలర్లు వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిమిష కుటుంబం.. హతుడి కుటుంబానికి చెప్పిందట.

యెమెన్‌లో భారతీయ నర్సు నిమిష ప్రియను ఉరి తీయడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. బుధవారం నిమిషను ఉరి తీయనున్నారు. భారత ప్రభుత్వం అన్ని రకాలుగా ఆమెను రక్షించేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇకపై చేసేదేమీ లేదని భారత ప్రభుత్వం చేతులెత్తేసింది. కుటుంబం మాత్రం నిమిషను రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఉన్న ఒకదారి అగమ్యగోచరంగా మారింది. గతంలో లాయర్ కొట్టిన దెబ్బతో పరిస్థితి ఇంత వరకు వచ్చింది.
ఒకే ఒక్క దారి.. దేవుడి మీదే భారం..
నిమిష ప్రియను కాపాడుకోవడానికి ఒకే ఒక్క దారి ఉంది. అదే ‘బ్లడ్ మనీ’. హతుడి కుటుంబం అడిగినంత డబ్బు ఇవ్వగలిగితే.. చివరి నిమిషంలోనైనా నిమిషకు ఉరి తప్పే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితమే నిమిష ప్రియ కుటుంబం బ్లడ్ మనీ కింద 10 లక్షల డాలర్లు సిద్ధం చేసుకుంది. అయితే, నిమిష కుటుంబానికి, హతుడి కుటుంబానికి మధ్యవర్తిత్వం వహించిన లాయర్ దెబ్బ కొట్టాడు. పెద్ద మొత్తంలో ఫీజు డిమాండ్ చేశాడు. తన ఫీజు చెల్లించే వరకు బ్లడ్ మనీ చర్చలు జరపనని తేల్చి చెప్పాడు. దీంతో ఎప్పుడో పూర్తి కావాల్సిన బ్లడ్ మనీ వాయిదా పడింది.
ప్రస్తుతం నిమిష ప్రియ కుటుంబం తరపున శామ్యుయెల్ జెరోమ్, షేక్ హబీబ్ హుమర్‌లు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. 10 లక్షల డాలర్లు వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిమిష కుటుంబం.. హతుడి కుటుంబానికి చెప్పిందట. అయితే, మృతుడి కుటుంబం మాత్రం బ్లడ్ మనీ విషయంలో ఇంకా ఎలాంటి సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. ఉరికి గంటల ముందు హతుడి కుటుంబం బ్లడ్ మనీకి ఒప్పుకుంటుందా అన్నది ఓ పెద్ద ప్రశ్నగా మారింది. ఆ దేవుడే నిమిషను కాపాడాలి. హతుడి కుటుంబం మనసు మార్చి.. బ్లడ్ మనీకి ఒప్పుకునేలా చేయాలి. లేదంటే.. విషాదం తప్పదు.
ఇవి కూడా చదవండి
జీవిత భాగస్వామి సంభాషణల రికార్డుల్ని సాక్ష్యంగా తీసుకోవచ్చు