Ashwini Vaishnaw: ఉపాధికి లక్ష కోట్ల ఊతం
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:49 AM
వచ్చే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పనకు ఉపకరించే ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి(ఈఎల్‌ఐ).. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలే లక్ష్యం
ఈఎల్‌ఐ పథకానికి కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా
మొదటిసారి ఉద్యోగంలో చేరేవారికి గరిష్ఠంగా
రూ.15వేల దాకా ప్రోత్సాహకం అందజేత
నూతన జాతీయ క్రీడా విధానం ‘ఖేలో భారత్ నీతి’.. టార్గెట్ 2047
న్యూఢిల్లీ, జూలై 1: వచ్చే రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాల కల్పనకు ఉపకరించే ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి(ఈఎల్‌ఐ).. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు.. ‘ఖేలో భారత్ నీతి’ పేరిట రూపొందించిన జాతీయ క్రీడా విధానానికి, వ్యూహాత్మక, నూతన రంగాల్లో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించే ‘రిసెర్చ్ డెవల్‌పమెంట్ అండ్ ఇన్నోవేషన్’(ఆర్డీఐ) పథకానికి పచ్చజెండా ఊపింది. వీటిలో ఈఎల్‌ఐ పథకానికి కేంద్రం రూ.99,446 కోట్లు కేటాయించింది. వచ్చే రెండేళ్లలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారిలో 1.92 కోట్ల మంది మొదటిసారి ఉద్యోగం చేసేవారే ఉంటారని అంచనా. అన్ని రంగాల్లో ఉద్యోగాల సృష్టి, యువతలో నైపుణ్యాల కల్పన, సామాజిక భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తయారీ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. కాగా, ఈ పథకం కింద.. మొదటిసారి ఉద్యోగం చేసేవారు (ఈపీఎ్‌ఫలో నమోదైనవారు) రూ.15 వేల గరిష్ఠ పరిమితితో ఒక నెల ఈపీఎఫ్ వేతనాన్ని రెండు విడతలుగా (ఉద్యోగంలో చేరిన ఆర్నెల్లకు తొలి విడత, 12నెలల సర్వీస్, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత రెండో విడత మొత్తాన్ని) పొందుతారు.
ఆధార్‌తో అనుసంధానమైన చెల్లింపుల విధానం ద్వారా వారికి ఈ మొత్తాన్ని అందజేస్తారు. రూ.లక్ష దాకా జీతం అందుకునే ఉద్యోగులు ఈ ప్రోత్సహకాన్ని అందుకోవడానికి అర్హులు. ఉద్యోగుల్లో పొదుపు చేసే అలవాటును ప్రోత్సహించేందుకుగాను.. ఈ ప్రోత్సాహకాల్లో కొంత భాగాన్ని నిర్ణీత కాలావధికి డిపాజిట్ చేస్తారు. ఆ కాలపరిమితి పూర్తయ్యాక ఉద్యోగి ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఇక, యాజమాన్యాలకు విషయానికి వస్తే.. ఈ ప్రోత్సాహకాలను అందుకోవడానికి.. 50 మందిలోపు ఉద్యోగులు ఉండి, ఈపీఎ్‌ఫవోలో నమోదు చేసుకున్న సంస్థలు ఏడాదికి అదనంగా ఇద్దరు ఉద్యోగులను.. 50 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉండే కంపెనీలు ఏడాదికి అదనంగా ఐదుగురు ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుంది. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 నడుమ అలా అదనపు ఉద్యోగాలు కల్పించే యాజమాన్యాలకు (రెండేళ్లపాటు) ఈ ప్రోత్సాహకాలు అందుతాయి. కనీసం ఆరు నెలలపాటు ఉద్యోగులను కొనసాగించే యాజమాన్యాలకు.. ప్రతి అదనపు ఉద్యోగికీ ఇచ్చే జీతం ఆధారంగా నెలకు గరిష్ఠంగా రూ.3 వేల చొప్పున రెండేళ్లపాటు ఇస్తారు. ఉద్యోగి వేతనం రూ.10వేల లోపుంటే నెలకు రూ.1000 చొప్పున, జీతం రూ.10వేల నుంచి 20 వేల లోపు ఉంటే నెలకు రూ.2000 చొప్పున, ఉద్యోగి జీతం రూ.20 వేల నుంచి రూ.లక్షలోపు ఉంటే నెలకు రూ.3000 చొప్పున ఈ ప్రోత్సాహకం ఇస్తారు. తయారీరంగంలో అయితే ఈ ప్రోత్సాహకాలను నాలుగేళ్లపాటు ఇస్తారు. ఇక.. నూతన రంగాల్లో పరిశోధనలు, నవకల్పనలకు ఊతమిచ్చేందుకుగాను రూపొందించిన ‘రిసెర్చ్ డెవల్‌పమెంట్ అండ్ ఇన్నోవేషన్ (ఆర్డీఐ)’ పథకాన్ని రూ.లక్ష కోట్ల కార్పస్ ఫండ్‌తో అమలు చేయనున్నారు. పరిశోధనలు, ఆవిష్కరణల్లో ప్రైవేటు రంగం పెట్టుబడులను ప్రోత్సహించడానికి తక్కువ/సున్నా వడ్డీ రేట్లతో దీర్ఘకాల వ్యవధిలో ఫైనాన్సింగ్ అందించడమే ఈ పథకం లక్ష్యం.
వాణిజ్య ఎల్పీజీ ధర రూ.58.5 తగ్గింపు
న్యూఢిల్లీ, జూలై 1: వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల గ్యాస్ బండ ధరను తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. తగ్గింపు ధరలు జూలై 1 నుంచే అమలులోకి వచ్చినట్లు ప్రకటించాయి. ఒక్కో సిలెండరుపై రూ.58.50 తగ్గింది. వాణిజ్య సిలెండర్... 19 కేజీల బండ ధరను రూ.1,665గా కంపెనీలు నిర్ణయించాయి. తాజాగా వాణిజ్య సిలెండర్ ధర విజయవాడలో రూ.1,818.5 కాగా... హైదరాబాద్‌లో రూ.1,886.5గా ఉంది. కాగా, ఢిల్లీలో జీవిత కాలం ముగిసిన పెట్రోలు, డీజిల్ వాహనాలకు ‘ఇంధనం లేదు’ అంటూ పెట్రోలు బంకుల్లో బోర్డులను ఏర్పాటు చేశారు.