Share News

మహా కుంభ్‌మేళాకు టెంట్లు సప్లై చేసిన కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:57 PM

Prayagraj Warehouse: అగ్ని ప్రమాదం జరగడానికి గ్యాస్ సిలిండర్ ప్రమాదమే కారణంగా తెలుస్తోంది. గోడౌన్‌లో పని చేసే రాహుల్ అనే వ్యక్తి తాను గ్యాస్ సిలిండర్ పేలిన శబ్ధం విన్నట్లు తెలిపాడు. అయితే, ప్రమాదం ఎందుకు జరిగిందన్న దానిపై క్లారిటీ లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మహా కుంభ్‌మేళాకు టెంట్లు సప్లై చేసిన కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం
Prayagraj Warehouse

ప్రయాగ్‌రాజ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మహా కుంభ్‌మేళాకు వివిధ రకాల టెంట్లు సరఫరా చేసిన ప్రముఖ కంపెనీ వేర్ హౌస్లో మంటలు చెలరేగాయి. ప్రయాగ్‌రాజ్లోని పెరేడ్ గ్రౌండ్‌లో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పెద్ద మొత్తంలో టెంటింగ్ సామాన్లు మంటల్లో కాలిపోయాయి. మంటల్ని గమనించిన వేర్ హౌస్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చారు. కొన్ని నిమిషాల్లోనే ఆరు ఫైర్ ఇంజిన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపు చేయటం మొదలెట్టాయి.


కొద్దిసేపటి తర్వాత మరికొన్ని ఫైర్ ఇంజిన్లు అక్కడకు వచ్చాయి. మంటల్ని అతి కష్టం మీద అదుపులోకి తీసుకువచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి సమీక్షించారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కూడా కాలేదు. అగ్ని ప్రమాదం జరగడానికి గ్యాస్ సిలిండర్ పేలడమే కారణంగా తెలుస్తోంది. వేర్ హౌస్‌ దగ్గరలో ఉండే గోడౌన్‌లో పని చేసే రాహుల్ అనే వ్యక్తి ప్రమాదం గురించి మాట్లాడాడు. తాను గ్యాస్ సిలిండర్ పేలిన శబ్ధం విన్నట్లు తెలిపాడు.


ఇక, ప్రయాగ్‌రాజ్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ పాండే ఘటనపై మాట్లాడుతూ.. ‘ కర్రలు, టెంట్లు భద్ర పరిచిన చోటే ప్రమాదం జరిగింది. సమాచారం అందగానే ఆరు ఫైర్ ఇంజిన్లను పంపాం. ఆ తర్వాత మరికొన్ని ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు ఆర్పాము’ అని అన్నారు. అయితే, ప్రమాదం ఎందుకు జరిగిందన్న దానిపై క్లారిటీ లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరగడానికి గల అసలు కారణాల కోసం అన్వేషిస్తున్నారు. వేర్‌హౌస్‌లో పని చేసే సిబ్బందిని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

JEE Main 2025: జేఈఈ ఇండియా టాపర్ ఓం ప్రకాశ్ విజయ రహస్యం ఇదే..

కన్న కొడుకు క్రూరత్వం.. కుక్క కోసం తల్లిని చంపేశాడు..

Updated Date - Apr 19 , 2025 | 12:57 PM