Minister Pratap Baburao: ప్రతిపక్షం నిరసన ర్యాలీలో మంత్రి
ABN , Publish Date - Jul 09 , 2025 | 02:50 AM
మరాఠా అస్తిత్వం కోసమంటూ మహారాష్ట్రలో ప్రతిపక్ష ఎంఎన్‌ఎస్ పార్టీ మంగళవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ఏకంగా ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఏక్‌నాథ్ శిందే శివసేన వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు ప్రతాప్ బాబూరావు సర్‌నాయక్ పాల్గొనడం సంచలనమైంది.

ఎంఎన్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మరాఠా అస్తిత్వ
ర్యాలీలో ప్రతాప్ బాబూరావు..అరెస్టు చేయాలని సవాలు
న్యూఢిల్లీ, జూలై 8: ‘మరాఠా అస్తిత్వం’ కోసమంటూ మహారాష్ట్రలో ప్రతిపక్ష ఎంఎన్‌ఎస్ పార్టీ మంగళవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ఏకంగా ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఏక్‌నాథ్ శిందే శివసేన వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు ప్రతాప్ బాబూరావు సర్‌నాయక్ పాల్గొనడం సంచలనమైంది. ఆందోళనల్లో పాల్గొనడమే కాకుండా ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఎంఎన్‌ఎస్ ర్యాలీకి ప్రభుత్వం అనుమతినీయకపోడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘నేను ర్యాలీలో పాల్గొంటున్నాను. పోలీసులకు అంత ధైర్యం ఉంటే, అరెస్టు చేస్తే చేసుకోనీయండి. నాది అన్ని వేళలా మరాఠా అస్తిత్వం కోసం పోరాడే వాళ్ల పక్షమే’’ అని తేల్చి చెప్పారు. వేరే రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వచ్చిన వ్యాపారులు కూడా స్థానికంగా మరాఠీలోనే మాట్లాడాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. జూలై 1న భయందేర్ ప్రాంతంలో ఓ ఫుడ్ స్టాల్ యజమాని మరాఠీలో మాట్లాడనందుకు ఎంఎన్‌ఎస్ కార్యకర్త కొట్టారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ కూడా ఎంఎన్‌ఎస్ కార్యకర్త చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో మంగళవారం థానేలోని మీరా రోడ్డులో మరాఠా అస్తిత్వ ర్యాలీని నిర్వహించేందుకు మరాఠీ ఏకీకరణ్ సమితి, ఇంకా చాలా సంస్థలు అనుమతి కోరాయి. అయితే ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అయినా, ఎంఎన్‌ఎ్‌స ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.