Leopards In Sugarcane Fields: చిరుతల్ని పాడు చేస్తున్న చెరుకు తోటలు.. సీను మొత్తం మారిపోయింది..
ABN , Publish Date - Nov 21 , 2025 | 09:14 AM
చెరుకు తోటల కారణంగా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలోని చిరుత పులులు పూర్తి స్థాయిలో మార్పును సంతరించుకున్నాయి. ‘చెరుకుతోటల చిరుత పులులు’ అన్న కొత్త జాతి మొదలైంది. ఈ జాతి కేవలం చెరుకు తోటల్లో మాత్రమే బతకగలదు.
న్యూఢిల్లీ, నవంబర్ 21: సాధారణంగా చిరుత పులులు అడవుల్లో ఉండటం పరిపాటి. అప్పుడప్పుడు అడవులకు దగ్గరగా ఉండే గ్రామాల్లోకి వచ్చి సాధు జీవాలపై దాడులు చేస్తూ ఉంటాయి. ఆకలి తీరిన తర్వాత మళ్లీ అడవుల్లోకి వెళుతూ ఉంటాయి. కానీ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. చిరుత పులుల జాతి మనుగడను ప్రశ్నించేంతలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందుకు కారణం చెరుకు తోటలు అంటే ఆశ్చర్యం కలగక మానదు. చెరుకు తోటల కారణంగా ఆ రెండు రాష్ట్రాల్లోని చిరుత పులులు అడవులకు పూర్తిగా దూరం అయ్యాయి.
అంతేకాదు.. బొద్దుగా, బద్ధకంగా తయారయ్యాయి. రెండు తరాల నుంచి చిరుత పులులు చెరుకు తోటలను నివాసంగా మార్చుకుని జీవిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పుట్టిన చిరుత పులులకు అసలు అడవి అంటేనే తెలీదు. ఆఖరికి వేటాడ్డంలో కూడా చాలా మార్పులు చేసుకున్నాయి. చెరుకు తోటల్లో ఉంటూ.. గ్రామాల్లోని పిల్లులు, కుక్కులు, గొర్రెలు, మేకలు వంటి వాటిని చంపి తినటం అలవాటు చేసుకున్నాయి. ఆఖరికి ఎలుకలు,ఉడతలు, ఉడుములు వంటి చిన్న జీవుల్ని కూడా చంపి తినటం మొదలెట్టాయి.
అత్యంత అరుదుగా మాత్రమే మనుషుల మీద దాడులు చేస్తున్నాయి. దాదాపు 30 ఏళ్ల నుంచి చెరుకు తోటల్లోనే ఉండటం వల్ల ‘చెరుకుతోటల చిరుతలు’ అనే కొత్త జాతి ప్రారంభం అయింది. ఆహారం సులభంగా దొరుకుతుండటం, చెరుకు తోటల్లో రక్షణ దొరుకుతుండటంతో చిరుతలు స్థిర నివాసం ఏర్పరుచుకున్నాయి. బిజ్నోర్ నుంచి హరిద్వార్ వరకు ఉన్న చెరుకు తోటల్లో పెద్ద సంఖ్యలో చిరుత పులులు నివాసం ఉంటున్నాయి. అధికారులు వాటిని పట్టి జూలకు తరలిస్తున్నారు. అటవీ అధికారులు నాలుగేళ్లలో దాదాపు వంద చిరుతల్ని పట్టి జూలకు తరలించారు. ఆ చిరుతలు అడవిలో బతకలేవన్న ఉద్దేశ్యంతో అధికారులు వాటిని జూలకు తరలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
25 ఏళ్ల వయసులోనే కారుణ్య మరణాన్ని ఎంచుకున్న యువతి.. హృదయం ద్రవించే ఘటన