Share News

Lalit Modi: లలిత్‌ మోదీ, విజయ్‌మాల్యా డ్యాన్స్‌

ABN , Publish Date - Jul 05 , 2025 | 05:19 AM

విదేశాలకు పారిపోయిన ఘరానా ఆర్థిక నేరగాళ్లు లండన్‌లోని ఓ పార్టీలో ‘ఐ డిడ్‌ ఇట్‌ మై వే’ అనే పాట పాడుతూ.. స్టెప్పులేయడం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Lalit Modi: లలిత్‌ మోదీ, విజయ్‌మాల్యా డ్యాన్స్‌

  • లండన్‌లోని తన ఇంట్లో లలిత్‌ మోదీ పార్టీ.. వీడియో వైరల్‌

లండన్‌, జూలై 4: విదేశాలకు పారిపోయిన ఘరానా ఆర్థిక నేరగాళ్లు లండన్‌లోని ఓ పార్టీలో ‘ఐ డిడ్‌ ఇట్‌ మై వే’ అనే పాట పాడుతూ.. స్టెప్పులేయడం నెట్టింట వైరల్‌ అవుతోంది. కామన్వెల్త్‌ కుంభకోణం, మనీలాండరింగ్‌ కేసుల్లో నిందితుడు, ఐపీఎల్‌ మాజీ చీఫ్‌ లలిత్‌ మోదీ లండన్‌లోని తన ఇంట్లో ఇచ్చిన ఓ పార్టీకి రూ.9 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యా హాజరయ్యారు. మాజీ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ సహా.. 310 మంది అతిథులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ విందులో లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యా కలిసి ఫ్రాంక్‌ సినట్రా ఆలపించిన ప్రసిద్ధ పాట ‘ఐ డిడ్‌ ఇట్‌ మై వే..’ను కలిసి పాడారు.


ఈ వీడియోను లలిత్‌ మోదీ స్వయంగా తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేశారు. ‘‘ఇంటర్నెట్‌ను ఈ వీడియో బ్రేక్‌ చేయదని ఆశిస్తున్నా. ఇది వివాదాస్పదమే కానీ.. నేను చేసేది అదే’’ అని ఆయన పోస్టు చేశారు. క్రిస్‌ గేల్‌ కూడా తన సోషల్‌ మీడియా ఖాతాల్లో ఈ వీడియోలు, ఫొటోలను షేర్‌ చేశారు. విజయ్‌ మాల్యా, లలిత్‌ మోదీని భారత్‌కు రప్పించాలని సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే..! అయితే.. పరారీలో ఉన్న నేరస్థులుగా కోర్టులు గుర్తించిన వీరిద్దరు మాత్రం చిందులేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Updated Date - Jul 05 , 2025 | 05:19 AM