Mobile Phone Dispute: మొబైల్ ఫోన్ విషయంలో గొడవ.. అర్థరాత్రి ఇంటికి వచ్చి..
ABN , Publish Date - Jun 21 , 2025 | 03:30 PM
Mobile Phone Dispute: పోలీసులు గణేష్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. పోలీసులు చెప్పినా అతడిలో మార్పు రాలేదు. గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అతడు ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ పెట్టుకున్నాడు.

బెంగళూరు: మొబైల్ ఫోన్ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. అంతకంటే ఎక్కువగా నష్టాలే ఉన్నాయి. ఒకసారి సెల్‌ఫోన్ అడిక్షన్‌లోకి వెళ్లిపోతే.. బయటపడటం చాలా కష్టం. సెల్ ఫోన్ అధికంగా వాడటం వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు బంధాలు కూడా దెబ్బ తింటున్నాయి. సెల్ ఫోన్లు కాపురాల్లో కూడా చిచ్చు పెడుతున్నాయి. తాజాగా, ఓ వ్యక్తి తన భార్య ప్రాణాలు తీశాడు. భార్య సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతోందన్న కోపంతో గొడపడి ఆమెను చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో గురువారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, ఉడిపిలోని కొలంబ గ్రామానికి చెందిన 42 ఏళ్ల గణేష్ పూజారికి.. అదే ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల రేఖకు 8 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గణేష్ పూజారి పెయింటర్‌గా పని చేస్తుండగా.. రేఖ పెట్రోల్ బంక్‌లో పని చేస్తోంది. రేఖ ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ వాడుతూ ఉండేది. ఇది గణేష్‌కు నచ్చేది కాదు. ఆమెతో గొడవపెట్టుకునే వాడు. సెల్ ఫోన్ విషయంలో భర్త వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవటంతో రేఖ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు గణేష్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. పోలీసులు చెప్పినా అతడిలో మార్పు రాలేదు. గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అతడు ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ పెట్టుకున్నాడు. గొడవ సందర్భంగా భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. భార్యను చంపేసిన తర్వాత అక్కడినుంచి పారిపోయాడు. రేఖ మర్డర్ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రేఖ చనిపోవటం.. గణేష్ జైలు పాలవ్వటంతో .. పాపం వారి పిల్లలు తల్లిదండ్రులు లేని వారయ్యారు.
ఇవి కూడా చదవండి
పాపం ఈ నటుడు.. పని దొరకలేదన్న ఆవేదనతో..
గర్భిణీ స్త్రీలు యోగా చేయొచ్చా.. ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..