Nimisha Priya: కేరళ నిమిష ప్రియ కేసు; విదేశాల్లో ఎంతమంది ఇండియన్స్‌కు ఉరి?
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:29 PM
యెమన్ దేశంలో ఉరిశిక్షకు గురైన కేరళకు చెందిన నిమిష ప్రియ కేసే మొదటిదా అంటే.. కాదు! అయితే, విదేశాల్లో ఇంతవరకూ ఎంతమంది భారతీయులు ఉరిశిక్షకు గురయ్యారు? ఎంతమంది జైళ్లలో మగ్గుతున్నారు అనే విషయాలను కేంద్రం బయటపెట్టింది.

ఇంటర్నెట్ డెస్క్: కేరళకు చెందిన నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష పడ్డం, తాజాగా శిక్షను ఆ దేశం వాయిదా వేయడం జరిగింది. దీంతో నిమిష ప్రియకు బిగ్ రిలీఫ్ దక్కినట్టైంది. నిమిష ప్రియను ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయులకు విదేశాల్లో మరణశిక్ష విధించడం ఇదే తొలిసారా? అనే సందేహం చాలా మందిలో ఉంది. దీనికి సమాధానం కాదు. ఇప్పటి వరకు చాలా మంది భారతీయులు విదేశాల్లో ఉరిశిక్ష మూలంగా మృత్యువాత పడ్డారు. ఎంత మంది? ఇలా ప్రాణాలు కోల్పోయారన్న విషయానికి వస్తే,
విదేశాల్లో ఎంత మంది భారతీయులకు ఉరిశిక్షలు పడ్డాయి?
విదేశాల్లో ఎంత మంది భారతీయులు ఉరిశిక్షల కారణంగా ప్రాణాలు కోల్పోయారన్న విషయానికొస్తే, 2025 మార్చిలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పార్లమెంటుకు చెప్పిన వివరాల ప్రకారం.. మొత్తంగా ఇప్పటి వరకూ ఎనిమిది దేశాలలో 49 మంది భారతీయ పౌరులకు మరణశిక్ష విధించబడింది. వీరిలో 25 మందికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) శిక్ష విధించగా, సౌదీ అరేబియాలో 11 మందికి, మలేషియాలో ఆరుగురికి, కువైట్లో ముగ్గురు, ఇండోనేషియా, యుఎస్, ఖతార్, ఇంకా యెమెన్లలో ఒక్కొక్కరికి మరణశిక్ష విధించారు. అయితే, గత ఐదేళ్లలో యుఎఇలో ఏ భారతీయుడిని కూడా ఉరితీయలేదు. జూన్ నెలలో షాజాద్ ఖాన్తో సహా ముగ్గురు భారతీయులకు హత్య కేసులో మరణశిక్ష విధించారు.
విదేశీ మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం, సౌదీ అరేబియా తొమ్మిది మంది భారతీయులకి, జింబాబ్వేలో ఐదుగురికి, మలేషియా ఇంకా జమైకాలో ఒక్కొక్కరికీ మరణశిక్ష అమలు చేశారు. మొత్తంగా, గత ఐదేళ్లలో 22 మంది భారతీయులకు మరణశిక్షను విధించారు. కానీ, యుఎఇలో ఉరిశిక్ష ఎవరికీ అమలు చేయలేదు.
విదేశాల్లోని జైళ్ల్ లో ఉన్న భారతీయ ఖైదీలు ఎంత మంది?
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. సౌదీ అరేబియాలో 2,633 మంది భారతీయ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారు. యుఎఇ లో 2,518 మంది ఖైదీలు ఉన్నారు. ఈ రెండు దేశాల్లోనే భారతీయులు అత్యధిక సంఖ్యలో ఖైదీలుగా ఉన్నారు. ఇక, ఇతర దేశాల విషయానికి వస్తే, నేపాల్ జైళ్లలో 1,317 మంది ఖైదీలుగా ఉండగా, ఖతార్ 611 , కువైట్ 38, మలేషియా 338, పాకిస్తాన్ 266, చైనా 173, అమెరికా 169 , ఒమన్ లో 148 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారు. ఈ ఖైదీలలో కొందరు హత్య, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఇతర తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించబడింది.
తాజాగా, కేరళకు చెందిన నిమిష ప్రియ విషయానికొస్తే..
కేరళకు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్ పూర్తి చేసి 2008లో యెమెన్ దేశానికి వెళ్లింది. అక్కడ కొన్నేళ్ళ పాటు పలు ఆస్పత్రుల్లో నర్సుగా పని చేసింది. ఈ నేపథ్యంలోనే 2014లో ఆమెకు స్థానికంగా ఉండే తలాల్ అబ్దో మహది అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. యెమెన్ దేశం రూల్స్ ప్రకారం .. నిమిషా తన క్లినిక్ బిజినెస్‌లో తలాల్ అబ్దోను భాగస్వామిగా చేర్చుకుంది. అయితే, క్లినిక్ ఓపెన్ చేసిన కొంత కాలానికే వారిద్దరి మధ్య గొడవలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడికి జైలు శిక్ష పడింది. అయితే, అతడు జైలు నుండి విడుదైల ఆమెను టార్చర్ చేయడం మొదలెట్టాడు. ఆమె పాస్ పోర్టు తీసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు.
ఇక రోజు రోజుకు అతడి వేధింపులు పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయిన నిమిషా పాస్ పోర్టు తిరిగి తీసుకోవడానికి అతడిని చంపాలని ప్లాన్ వేసింది. 2017లో అతడికి ఇంజెక్షన్ వేసి చంపేసింది. అయితే, పాస్ పోర్టు తీసుకుని తిరిగి ఇండియాకు తిరిగి వస్తున్న సమయంలో ఆమెను యెమెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2017నుంచి ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది. 2023లో యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ ఆమెకు మరణ శిక్ష విధించింది. అయితే, మరణ శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆమెకు ఉన్న ఒకే ఒక్క దారి ‘బ్లడ్ మనీ’. అంటే బాధితుడి కుటుంబం ఎంత డబ్బు అడిగితే అంత ఇవ్వడం. దీంతో నిమిషాను కాపాడ్డానికి ఆమె కుటుంబం ‘బ్లడ్ మనీ’కి కూడా సిద్ధమైంది.
అయితే, నిమిషా తరపు న్యాయవాది తనకు 40 వేల డాలర్ల ఫీజు ఇస్తేనే కేసు పరిష్కరిస్తానని లేదంటే లేదని తేల్చి చెప్పాడు. రెండు విడతలుగా డబ్బులు చెల్లించడానికి ప్రియ కుటుంబానికి అవకాశం ఇచ్చాడు. మొదటి విడత డబ్బులు ఇచ్చారు కానీ రెండో విడత డబ్బులు జమచేసే దగ్గర సమస్యలు వచ్చాయి. ఇలా 2024 సెప్టెంబర్ లో బ్లడ్ మనీ నిలిచిపోయింది. దీంతో నిమిషాకు ఈ నెల 16వ తేదిన ఉరి తేదీ ఖరారు చేశారు. అయితే, కేంద్రం ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు చేసి రేపు విధించాల్సిన ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా పడేలా చేసింది.
Also Read:
Youth Fight: అర్ధరాత్రి రోడ్డుపై యువతీయువకుల హల్‌చల్..
MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్..!
For More Telangana News and Telugu News..