Working Women: మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నెలసరి సెలవుపై కీలక నిర్ణయం
ABN , Publish Date - Nov 14 , 2025 | 09:11 PM
ఎన్నో శ్రమలు, ఒడిదుడుకులు సహించి ఆఫీసు పనిలో నెగ్గుకొస్తోంది నేటి మహిళామణి. తన స్వప్నాన్ని, సమయాన్ని కాపాడుకుంటూ ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ వర్కింగ్ ఉమెన్ ముందుకు సాగుతున్నారు.. అలాంటి వీళ్లకి ఇప్పుడొక గుడ్ న్యూస్..
ఇంటర్నెట్ డెస్క్: మహిళా ఉద్యోగులకు కర్ణాటక సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఇక మీదట జీతంతో కూడిన నెలసరి సెలవు పొందే అవకాశం కల్పించింది. సంఘటిత రంగంలో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఈ వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఫలితంగా, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న18 నుంచి 52 ఏళ్ల వయస్సున్న మహిళలు ప్రతి నెలా ఒక రోజు నెలసరి సెలవు తీసుకోవచ్చు.
ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్న దాదాపు 4 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుంది. ఈ సెలవు పొందేందుకు ఉద్యోగినిలు ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదు. కాంట్రాక్ట్, జాబ్ తరహాతో సంబంధం లేకుండా తొలిసారి ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు కూడా నెలసరి సెలవు దక్కనుండటం విశేషం.
అయితే, ఈ పరిధిలోకి రాని మహిళా ఉద్యోగుల సంఖ్య కూడా భారీగానే ఉంది. ఇంటిపని, రోజువారీ కూలీలు, గిగ్‌వర్కర్లుగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి సంఖ్య కర్ణాటకలో 60 లక్షలుగా ఉంటుందని అంచనా. అయితే, వీరికి ప్రస్తుత ఫలితం దక్కదు. అందుకోసమే, అసంఘటిత రంగానికి కూడా ఈ పాలసీని వర్తింపచేయాలని నిపుణులు కోరుతున్నారు.
కాగా, బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే నెలకు రెండు రోజులపాటు నెలసరి సెలవులు ఇస్తున్నాయి. కేరళ తమ రాష్ట్రంలోని యూనివర్సిటీ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సిబ్బందికి మాత్రమే నెలసరి సెలవులు ఇస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఆపేదెవరు.. బీహార్‌లో నితీశ్ ఏకఛత్రాధిపత్యం..
బిహార్‌లో గెలుపు మాదే.. ఇక బెంగాల్‌లోనూ..: కేంద్ర మంత్రి
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..