Share News

Ranya Rao: నటి రన్యారావుకు ఏడాది జైలు

ABN , Publish Date - Jul 18 , 2025 | 05:29 AM

కన్నడ నటి రన్యారావు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడ్డ కేసులో కఠినమైన కొఫెపోసా చట్టం కింద ఆమెకు ఏడాది జైలుశిక్ష పడింది.

Ranya Rao: నటి రన్యారావుకు ఏడాది జైలు

  • శిక్షా కాలంలో బెయిల్‌కు అవకాశం లేదు

  • బంగారం స్మగ్లింగ్‌ కేసులో ‘కొఫెపోసా’ అడ్వైజరీ బోర్డు తీర్పు

బెంగళూరు, జూలై 17(ఆంధ్రజ్యోతి): కన్నడ నటి రన్యారావు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడ్డ కేసులో కఠినమైన కొఫెపోసా చట్టం కింద ఆమెకు ఏడాది జైలుశిక్ష పడింది. ఈ మేరకు విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్‌ కార్యకలాపాల నివారణ చట్టం (కొఫెపోసా) అడ్వైజరీ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్బంధ కాలంలో ఆమెకు బెయిల్‌ మంజూరు ఉండబోదని తాజాగా తీర్పునిచ్చింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) చట్టబద్ధంగా నిర్దేశించిన కాలపరిమితిలో చార్జిషీట్‌ దాఖలు చేయడంలో విఫలం కావడంతో.. సహ నిందితుడు తరుణ్‌ రాజుతో పాటు రన్యారావుకు సిటీ కోర్టు మే 20న డిఫాల్ట్‌ బెయిల్‌ ఇచ్చింది. రూ.2 లక్షల బాండ్‌, ష్యూరిటీ షరతులపై బెయిల్‌ మంజూరైనప్పటికీ.. కొఫెపోసా కింద ముందస్తు నిర్బంధం ఉత్తర్వుల కారణంగా ఇద్దరూ కస్టడీలోనే కొనసాగారు.


అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంపై, అధికారిక అభియోగాలు లేకుండానే ఏడాది పాటు నిర్బంధంలో ఉంచేందుకు ఇది వీలు కల్పిస్తుంది. రన్యారావు ఈ ఏడాది మార్చిలో దుబాయ్‌ నుంచి రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. రన్యారావు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్లను స్థానిక కోర్టులు రెండుసార్లు, ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.

Updated Date - Jul 18 , 2025 | 05:29 AM