JD Vance India Tour: నేడు భారత్‌కు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు.. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 21 , 2025 | 09:20 AM
అమెరికా ఉపాధ్యక్షుడు కుటుంబ సమేతంగా నేడు భారత్‌కు రానున్నారు. గురువారం వరకూ భారత్‌లో పర్యటించనున్నారు. వాన్స్‌కు ఇది తొలి అధికారిక భారత్ పర్యటన. ఆయన టూర్ షెడ్యూల్ పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సతీసమేతంగా మరి కాసేపట్లో భారత్‌కు రానున్నారు. ఆయనకు ఇది భారత్‌లో తొలి అధికారిక పర్యటన. ఇటలీ పర్యటన ముగించుకుని బయలుదేరిన వాన్స్ ఉదయం 9.30 గంటలకు ఢిల్లీలో ల్యాండవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేటి నుంచి ఏప్రిల్ 24 వరకూ ఆయన భారత్‌లో పర్యటించనున్నారు.
వైట్‌హౌస్ ప్రకటన ప్రకారం, వ్యాన్స్ నేడు ఢిల్లీలో ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారు. నేటి సాయంత్రం 6.30కు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో అధికారికంగా సమావేశం కానున్నారు. మంగళవారం జైపూర్‌లో, బుధవారం ఆగ్రాలో పర్యటిస్తారు. గురువారం తిరుగుప్రయాణం అవుతారు.
వాన్స్ దంపతులుతో పాటు వారి పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్ కూడా భారత్‌లో పర్యటిస్తారు. పలామ్ ఎయిర్‌బేస్ వాన్స్ కుటుంబానికి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో స్వాగతం పలుకనుంది. ఆ తరువాత వాన్స్ దంపతులు స్వామినారాయణ్ అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. భారత్ హస్తకళ వస్తువులు ప్రదర్శించే షాపులను కూడా వారు సందర్శింస్తారు.
ఇక సాయంత్రం వాన్స్ ప్రధాని నరేంద్ర మోదీని లోక్ కళ్యాణ్ మార్క్‌లోని ఆయన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చిస్తారు. వాణిజ్య ఒప్పందంపై ప్రముఖంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మోదీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ సెక్రెటరీ విక్రమ్ మిశ్రీ, అమెరికాలో భారతీయ రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
మరోవైపు, వాన్స్ రాకనేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో వివిధ సమయాల్లో, ప్రాంతాల వారీగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఉదయం 9 నుంచి 11.00
ఈ సమయంలో సర్దార్ పటేల్ మార్గ్, గురుగ్రామ్ రోడ్, పరేడ్ రోడ్, తిమ్మయ్య మార్గ్ , ఎయిర్‌ఫోర్స్ రోడ్, తోపాటు పరిసర ప్రాంతాల్లో వాహనాలకు అనుమతి ఉండదు.
11 ముర్తీ రోడ్ మీదుగా ఆర్‌ఎమ్‌ఎల్ వెళ్లే వారిని వందేమాతరం మార్గ్ రోడ్డువైపు మళ్లిస్తారు.
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకూ
సెంట్రల్ ఢిల్లీలో పలు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నారు. సీ-హెక్సాగాన్, జన్‌పథ్ రోడ్, సర్దార్ పటేల్ మార్గ్, పరిసర ప్రాంతాల్లో వాహనాలు పార్క్ చేసేందుకు అనుమతి లేదు. సికందర్ రోడ్, ఫిరోజ్ షా రోడ్, ఎమ్ఎన్ఎల్‌పీ, వికాస్ మార్గ్, నోయిడా లింక్ రోడ్డు అక్షర్‌ధామ్‌తో పాటు వాటికి అనుసంధానంగా ఉన్న రోడ్లల్లో పార్కింగ్‌కు అనుమతి లేదు.
ట్రాఫిక్‌లో చికుక్కుపోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఫాలో కావాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డా.రాజేంద్రప్రసాద్ మార్క్ మీదుగా జన్‌ఫథ్ రోడ్డు వైపు వెళ్లే వారు రెయిసీనా రోడ్డు మీదుగా విండ్సర్ సర్కిల్ నుంచి అశోకా రోడ్డు, సి-హెక్సాగాన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
జన్‌పథ్ మీదుగా కాన్నాట్ ప్లేస్‌లోకి ఔటర్ సర్కిల్ వైపు వెళ్లేవారు అశోకా రడ్డు నుంచి సీ-హెక్సాగాన్ వైపు మళ్లాల్సి ఉంటుంది. 11 మూర్తి రోడ్డు మీదుగా ఆర్ఎమ్ఎల్ వెళ్లాల్సిన వారు ధౌలా కోన్ ఫ్లైఓవర్ నుంచి ఆర్/ఏ శంకర్ రోడ్డు, టల్‌కటో రోడ్డు, షేఖ్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ మార్గ్ వినియోగించుకోవాలి. జాకీర్ హుస్సేన్ మార్గ్ మీదుగా సీ హెక్సాగాన్‌కు వెళ్లాల్సిన వారు మథురా రోడ్డు టీ పాయింట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ
ఈ సమయాల్లో సర్దార్ పటేల్ మార్క్, కమాల్ అటాటుర్క్ రోడ్డు, గురుగ్రామ్ రోడ్డు, పరేడ్ రోడ్డు, తిమ్మయ్య మార్క్, ఎయిర్‌ఫోర్స్ రోడ్డు, పరిసర ప్రాంతాల్లో పార్కింగ్‌కు అనుమతి లేదు. మునుపటి ట్రాఫిక్ మళ్లింపులను ఈ సమయంలో కూడా అమలు చేస్తారు. ప్రయాణాలకు ఆటంకాలు కలుగకుండా ఉండేందుకు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలను అభ్యర్థించారు. రైల్వే స్టేషన్లు, ఐఎస్‌బీటీలు, ఎయిర్‌పోర్టులకు వెళ్లే వారు కాస్త ముందుగా బయలుదేరాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
ఫేక్ డాక్టర్‌తో ఇంట్లో ఆపరేషన్.. మహిళ ప్రాణం పాయే..
Brides Mother: పచ్చి మోసం.. పిల్ల అని చెప్పి తల్లితో పెళ్లి చేశారు..